New Delhi, August 13: సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది నిజమో...ఏది అబద్దమో తెలుసుకోకుండానే నెటిజన్లు ఆ వార్తను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఎన్ని ఆంక్షలు విధించినా అవి కంట్రోల్ కావడం లేదు. తాజాగా ప్రణబ్ ముఖర్జీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన చనిపోయారంటూ (Pranab Mukherjee Death Rumours) సోషల్ మీడియాలో వార్తను వైరల్ చేశారు. మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరని సోషల్ మీడియా (Social Media) వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ స్పందించారు.
తన తండ్రి బ్రతికే ఉన్నారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై ప్రముఖ జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నప్రచారం దేశంలో మీడియా ఫేక్ న్యూస్ కర్మాగారంగా మారిన అంశాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ప్రణబ్ ముఖర్జీ, మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్, ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి
ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ప్రణబ్ ముఖర్జీ (Former President Pranab Mukherjee) ఆరోగ్య పరిస్థితిపై ఈ ఉదయం స్పందిస్తూ... ప్రణబ్ ఇంకా దీర్ఘ కోమాలోనే ఉన్నట్లు తెలిపాయి. అయినప్పటికీ రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోందన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ప్రకటించింది.
Check Abhijeet's tweet:
My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable !
Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News .
— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020
ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆగస్టు 10 న ఆర్మీ హాస్పిటల్‌లో చేరారు. మెదడులోని రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. ఆ తరువాత నుంచి ప్రణబ్ ముఖర్జీ వెంటిలేటర్‌పైననే ఉన్నారు. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజీత్ ముఖర్జీ ఒక ట్వీట్‌లో ప్రణబ్ ముఖర్జీకి రక్తపోటు స్థిరంగా ఉందని, గుండె పనిచేస్తోందని తెలిపారు. కాగా ప్రణబ్ ముఖర్జీకి మెదడుకు శస్త్రచికిత్స చేసేముందు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు.
మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ఆయన స్వగ్రామమైన బెంగాల్‌లోని మిరిటీలో మూడు రోజులుగా మృత్యుంజయ మంత్ర జపం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రణబ్ ముఖర్జీకి ఏది మంచిదైతే భగవంతుడు తనకు అదే ఇవ్వాలని కుమార్తె షర్మిష్ట ముఖర్జీ (Sharmistha) వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’అందుకున్న ఏడాదికే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం తనను బాధిస్తోందని కాంగ్రెస్ నేత కూడా అయిన షర్మిష్ట తెలిపారు.