New Delhi, JAN 25: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శనివారం 76వ గణతంత్ర దినోత్సవం (Republic Day 2025) సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ‘నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో భారత్ (India) ఒకటన్నారు. జ్ఞానానికి మూలంగా భారత్ పరిగణించబడిందని.. కానీ చీకటి కాలాన్ని గడపాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకున్నామన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందని, ఇది దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భమని పేర్కొన్నారు.
భరతమాత విముక్తి కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకున్నామని, వెలుగులోకి రాని మరికొందర ధైర్యవంతులను సైతం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని, ఈ ఏడాది కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించేందుకు, నూతన శక్తిని నింపేందుకు సాంస్కృతిక రంగంలో ఎన్నో ప్రోత్సాహకర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో భారతదేశపు మొట్టమొదటి పురావస్తు ప్రయోగాత్మక మ్యూజియం పూర్తి కాబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన విజయాలు, క్రీడాకారుల ప్రదర్శనను రాష్ట్రపతి ప్రశంసించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటీవలి సంవత్సరాలలో అంతరిక్ష శాస్త్ర రంగంలో గొప్ప విజయాలు సాధించిందన్నారు. లక్ష్యాల దిశగా మన నిజమైన ప్రయాణం సాగుతుందన్నారు. ఇక భారత్ అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా ఎదగడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దులను పరిరక్షిస్తున్న సైనికులతో పాటు సరిహద్దుల్లో దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్న పోలీసులు, పారామిలటరీ బలగాలను అభినందించారు.