New Delhi, March 01: పండుగకు ముందు సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చాయి పెట్రోలియం కంపెనీలు. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు భారీగా పెరగడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. గతేడాది జూలై 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరిగాయి. మరోసారి.. ఎనిమిది నెలల తరువాత వీటి ధరలను పెట్రోలియం సంస్థలు భారీగా పెంచేశాయి.
Domestic LPG Cylinder 14.2 kg prices increased by Rs 50/. Domestic LPG cylinder price increased to Rs 1103/ in Delhi: sources
— ANI (@ANI) March 1, 2023
తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరను పరిశీలిస్తే.. ప్రస్తుతం రూ.1053 నుంచి రూ. 1103కు చేరింది. ముంబైలో రూ. 1052.50 నుంచి రూ. 1102.50కి పెరిగింది. అదేవిధంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎల్పీజీ ధర రూ. 1769 ఉండగా.. తాజాగా పెరిగిన ధరతో రూ. 2119.50కి చేరింది. ముంబైలో ప్రస్తుతం రూ. 1721 ఉండగా రూ. 2071.50కి పెరిగింది. అయితే, ఈ ఏడాది కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి.
గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలపై ఆర్థికంగా భారం కానుంది. తాజాగా ధరల పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే.. మంగళవారం వరకు హైదరాబాద్ లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,105 ఉంది. తాజా పెంపుతో నేటి నుంచి రూ. 1,155 పెరిగింది. అదేవిధంగా ఏపీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1161 కి చేరింది.