New Delhi, August 29: రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి 'అనురాగ్ ఠాకూర్' గ్యాస్ ధర తగ్గింపుపై మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాగే ఎల్పీజీ ధర తగ్గింపుపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు
‘ఎల్‌పిజి సిలిండర్‌ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌పై రూ. 200 తగ్గనుంది. అంతే కాకుండా పీఎంయూవై వినియోగదారులకు (ఉజ్వల లబ్ధిదారులు ) మరింతగా తగ్గింపు వర్తించనుంది. ఫలితంగా పీఎంయూవై వినియోగదారులు ప్రస్తుతం ఉన్న సబ్బిడీతో కొత్త తగ్గింపు పొందుతారు. కావున వీరికి రూ. 400 తగ్గింపు లభిస్తుంది’ అని తెలిపారు. ప్రస్తుతం ఎల్‌పీజీ సిలెండర్ ధర రూ.1,100 వరకూ ఉంది.
ఎల్‌పిజి సిలిండర్లపై అదనపు సబ్సిడీ 33 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనకారిగా ఉంటుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2023-24 సంవత్సరానికి ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 200 తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 7,680 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అంతే కాకుండా ఉజ్వల పథకం కింద 7.5 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్‌లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మహిళలకు ఉచితంగా 75 లక్షల నూతన గ్యాస్ కనెక్షన్లు, కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం
కాగా, 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్) కుటుంబాల మహిళల కోసం 50 మిలియన్ల ఎల్‌పీజీ కనెక్షన్‌లను పంపిణీ చేయడానికి ప్రారంభించారు.