New Delhi, August 15: దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ లో 370 రద్దును ఆయన సమర్థించారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా "ఒకే భారతదేశం, శ్రేష్ఠమైన భారతదేశం" అనే సర్ధార్ వల్లభాయి పటేల్ కలను నెరవేర్చామని మోదీ వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ వంటి దురాచారాలను నిర్మూలించి మెరుగైన భారతదేశ నిర్మాణానికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
దేశ ప్రజలకు రక్షాబంధన్ మరియు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి, ప్రజల కోసం ఇప్పటివరకు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలుపుతూ రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారనేది వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
సమస్యలను సృష్టించడం లేదా వాటిని పొడిగించడం అనేది మాకు తెలియదు. రెండో సారి తమ ప్రభుత్వం ఏర్పడిన 70 రోజులలోపే, 'ఆర్టికల్ 370' ఒక చరిత్రగా మారింది. దీంతో 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం' అనే స్పూర్థి నేడు నిజమైంది. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మా నిర్ణయాలకు 2/3 వ సభ్యుల మద్ధతు లభించింది. జమ్మూకాశ్మీర్ మరియు లద్దాఖ్ లకు మేం సేవ చేయాలనుకుంటున్నాం.
ట్రిపుల్ తలాక్ వంటి దురాచారం పట్ల ముస్లిం మహిళలు ఇన్నాళ్లు భయంభయంగా జీవించారు. 'తక్షణ ట్రిపుల్ తలాక్' చెప్పడాన్ని రద్దు చేస్తూ ఒక చట్టాన్ని తయారు చేయడంతో వారికి ఆత్మగౌరవంతో జీవించే అవకాశం లభించింది. ట్రిపుల్ తలాక్ ఇతర ఇస్లాం దేశాలలో కూడా ఎప్పుడో తీసేషారు. మన దేశంలో సతీసహగమనం, బాల్య వివాహాలు రద్దు చేయగలిగినపుడు, ఇలాంటి దురాచారాన్ని రద్దు ఎందుకు చేయకు చేయకూడదు.
త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, వాయు సేన) సేవలు వెలకట్టలేనివి. దేశరక్షణ కోసం వారు చూపించే తెగువ ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం. త్రివిధ దళాల మధ్య సమన్వయం మెరుగు పరిచేలా మరియు వారిని మరింత పదును చేసేలా కొత్తగా రక్షణ సిబ్బంది ముఖ్యులను (CDS-Chief of Defence Staff) నియమించనున్నాం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కూడా భారత్ మంచి విజన్ తో ముందుకెళ్తుంది. భారత్ లో వ్యాపారం తమ ప్రభుత్వం మరింత సులభం చేస్తుంది. అనవసరమైన రూల్స్ ను గుర్తించి, తొలగిస్తున్నాము. 'ఈజ్ ఆఫ్ డూయింగ్' లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం, ప్రజలకు 'ఈజ్ ఆఫ్ లివింగ్' పైనే ఎక్కువ దృష్టి పెడుతుంది.
సుస్థిర ప్రభుత్వం, తమ పాలన మెరుగ్గా ఉండటంతో ప్రజలకు తమ ప్రభుత్వంపై మంచి నమ్మకం ఏర్పడింది. అదే విధంగా ఆకాంక్షలు కూడా పెరిగాయి. వారి మెరుగైన జీవన సౌలభ్యం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ .100 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రపంచంలో భారత్ ఒక బలమైన శక్తిగా ఏర్పడేలా తమ ప్రభుత్వం తగిన కార్యాచరణ రూపొందించుకుంది. 2014కు ముందు భారత ఎకానమీ 2 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. ఆ తర్వాత తమ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నించి సంపద పెరిగింది, పెట్టుబడులు పెరిగాయి. అవినీతి, టెర్రరిజం తగ్గింది. వచ్చే 5 ఏళ్లలో భారత ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లు పెంచడమే తమ లక్ష్యం. అందుకు దేశ ప్రజలందరి భాగస్వామ్యం అవసరం.