New Delhi, April 12: పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఒక్కసారిగా కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కొందరు దుండగులు బుధవారం తెల్లవారుజూమున స్టేషన్‌లోకి చొరబడి తుపాకులతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల ఘటన తర్వాత స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్‌లు అప్రమత్తం అయ్యాయి.మిలిటరీ స్టేషన్‌లో తెల్లవారుజామున 4:35 గంటలకు కాల్పులు(Firing inside military station) జరిగినట్లు సమాచారం.
అయితే ఈ కాల్పులు ఘటన వెనుక ఉగ్రకోణం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. తక్షణ స్పందన దళాలను రంగంలోకి దింపి బాధ్యుల కోసం వేట కొనసాగిస్తున్నారు. దండగులను గుర్తించేందుకు మిలిటరీ స్టేషన్ ప్రాంతాన్ని మొత్తం సీజ్ చేసి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అయితే ఈ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం కొన్ని ఆయుధాలు మాయమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వాటి కోసమూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.
పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి
ఇదిలా ఉంటే ఈ ఘటన ఉగ్రదాడి కాదని(Not a terror attack) పంజాబ్ ఎస్‌ఎస్పీ తెలిపారు.ఇది సోదరుల హత్య కేసుగా భావిస్తున్నామని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. మిలిటరీ స్టేషన్‌లోని అధికారుల మెస్‌లో ఈ ఘటన జరిగింది.కాల్పులు జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టి సీల్ చేశామని,గాలింపు కొనసాగుతుందని ఆర్మీ హెచ్‌క్యూ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. మిలటరీ స్టేషనులో ఏదో జరిగిందని, కానీ ఆర్మీ అంతర్గత విషయాలను తాము బయటపెట్టలేమని భటిండా ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా చెప్పారు. రెండు రోజుల క్రితం స్టేషన్‌లోని ఆర్టిలరీ యూనిట్‌లో కొన్ని ఆయుధాలు మాయమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తప్పిపోయిన ఈ ఆయుధాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైనిక వర్గాలు తెలిపాయి.
ఈ ఘటన సైనిక స్థావరం (Bathinda Military Station)లోని శతఘ్ని యూనిట్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఇది జరిగినట్లు భావిస్తున్నారు. మృతులను నిర్ధారించారు. ఆ ప్రదేశంలోనే సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. పౌర దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు అదృశ్యమయ్యాయి. ఈ ఘటనలో వీటిని వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బఠిండా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడ కీలకమైన 10వ కోర్ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపుర్ కేంద్రంగా పనిచేసే సౌత్-వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తుంది. బఠిండాలో పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఉన్నాయి.