New Delhi, Novemebr 14: గత కొంత కాలం నుంచి దేశ రాజకీయాల్లో మారు మోగుతున్న రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసు(Rafale Deal Case)లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) కీలక తీర్పును వెలువరించింది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై దాఖలైన సమీక్ష పిటిషన్లన్నింటిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో కోర్టులో కేసు నడుస్తున్న సంగతి విదితమే..
సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్ కేసు(Rafale case)లో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చేసింది.
ఈ కేసులో భాగంగానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ చౌకీదార్ చోర్ హై అంటూ తీవ్ర విమర్శలు చేసిన కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాహుల్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణప పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది.
ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ (France’s Dassault) నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాని (Central government)కి క్లీన్‌చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ రాఫెల్ డీల్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది.