Railway Fare Hike: ప్రయాణికులకు రైల్వే షాక్, పెరగనున్న రైల్వే ఛార్జీల ధరలు, కిలోమీటర్‌కు 5 నుంచి 40 పైసల వరకూ పెంచే అవకాశం, చార్జీల పెంపు ప్రతిపాదనకు నవంబర్‌లోనే ఆమోద ముద్ర వేసిన ప్రధాని కార్యాలయం
Railway Fare Hike likely this week, 5 to 40 paise per km increase expected (photo-ANI)

New Delhi, December 24: ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా రైలు చార్జీలను (Railway Fare Hike) భారీగా పెంచేందుకు భారతీయ రైల్వేలు రంగం సిద్ధం చేస్తున్నాయి. కిలోమీటర్‌కు 5 నుంచి 40 పైసల వరకూ పెంపు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.అన్ని రైళ్లకు తరగతుల వారీగా ప్రయాణీకుల చార్జీలను ఈ వారంలోనే పెంచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.

రైలు చార్జీల పెంపు ప్రతిపాదనకు నవంబర్‌లోనే ప్రధాని కార్యాలయం ఆమోదముద్ర వేసినా జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో (Jharkhand Assembly Election Results 2019) ప్రకటనలో జాప్యం నెలకొంది. కాగా ఆర్థిక మందగమనం ప్రభావంతో రైల్వేల ఆర్థిక వనరులపై ఒత్తిడి అధికమైంది.

గత రెండేళ్లుగా ప్రయాణీకుల చార్జీలను నేరుగా పెంచకపోవడంతో తాజాగా చార్జీల పెంపునకే రైల్వే శాఖ మొగ్గుచూపుతోంది. గతంలో కొన్ని రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ వ్యవస్ధతో పాటు రిఫండ్‌ వ్యవస్థలో మార్పులు వంటి చర్యలతో రాబడి పెంచుకున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రైల్వేల మొత్తం రాబడి గణనీయంగా తగ్గి రూ 13,169 కోట్లకు పరిమితమైంది. అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా మొత్తం వ్యయం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. వ్యయ నియంత్రణతో పాటు రాబడి పెంపునకు చార్జీల వడ్డన ద్వారా సమతూకం సాధించాలని రైల్వేలు యోచిస్తున్నాయి.