New Delhi, July 02: సరిగ్గా నెల రోజుల కిందట జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ (Balasore)జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha Train Accident) 293 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) నివేదిక స్పష్టం చేసింది. ఈ భారీ ప్రమాదానికి సిగ్నలింగ్ విభాగం సిబ్బంది బాధ్యులని పేర్కొంది. విధ్వంసం, సాంకేతిక లోపం వంటి అవకాశాలను తోసిపుచ్చింది. మూడేళ్ళ కిందట భద్రతా కారణాల దృష్ట్యా సిగ్నల్ వ్యవస్థలో మార్పులు జరిగినట్లు తెలిపింది. అయితే కొంత మంది గ్రౌండ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ వ్యవస్థ తనిఖీలో తగిన భద్రతా విధానాలను అనుసరించలేదని ఆరోపించింది.
కాగా, సిగ్నలింగ్ విభాగంలోని భద్రతా ప్రక్రియలను పర్యవేక్షించే అధికారులతోపాటు డిజైన్ మార్పులను అనుసరించని ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి కారణమని సీఆర్‌ఎస్ నివేదిక పేర్కొంది. ‘సర్క్యూట్‌లో చేసిన మార్పులను సెంట్రల్ డిజైన్‌లో చూపడంలో విఫలమయ్యారు. వార్షిక తనిఖీల్లో కూడా దీనిని గుర్తించలేదు. కాబట్టి ఈ ప్రమాదం కేవలం ఒక వ్యక్తి లోపం కాదు. కనీసం ఐదుగురు వ్యక్తుల తప్పిదం ఉంది’ అని రైల్వే అధికారి తెలిపారు.
మరోవైపు మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో నేరపూరిత కుట్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) దర్యాప్తు నివేదికను వెల్లడించబోమని రైల్వే అధికారి చెప్పారు.