Jaipur, DEC 16: రుణ వాయిదా చెల్లించమని అడిగిన ఫైనాన్స్ కంపెనీ (Finance Company) సిబ్బందిపై ఒక వ్యక్తి వేడి నూనెతో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు కాలిన గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని ఝుంజును (Jhunjhunu) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సురేంద్ర స్వామి అనే వ్యక్తి బజాజ్ ఫైనాన్స్ సంస్థ నుంచి వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. నెలవారీ వాయిదా అయిన ఈఎంఐను (EMI) అతడు చెల్లించలేదు. దీంతో ఆ సంస్థకు చెందిన నవీన్ కుమార్ (Naveen kumar), కుల్దీప్ (Kuldeep) అనే సిబ్బంది సురేంద్ర ఇంటికి వెళ్లారు. అతడు ఇంటి వద్ద లేకపోవడంతో ఫోన్ చేశారు. రాణా సతి రోడ్‌లోని ఒక బ్యాంక్ వద్ద తాను ఉన్నానని, అక్కడికి రావాలని వారికి చెప్పాడు. దీంతో వారిద్దరూ అక్కడకు వెళ్లారు. కాగా, ఈఎంఐ చెల్లించకపోవడంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన సురేంద్ర పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌లో ఒక జగ్గు తీసుకుని కాగుతున్న నూనెను నింపి నవీన్ కుమార్, కుల్దీప్‌పై పోశాడు.
Rajasthan horror: Finance company staff attacked with hot oil when he went to collect personal loan installment in Rajasthan's Jhunjhunu. pic.twitter.com/F42FBXLHNc
— Nakshab (@your_nakshab) December 15, 2022
ఈ సంఘటనలో నవీన్ కుమార్‌కు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. అతడ్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన కుల్దీప్‌కు ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ సంస్థకు (Bajaj finance) చెందిన సిబ్బందిపై వేడి నూనెతో దాడి చేసి పరారైన నిందితుడు సురేంద్ర కోసం వెతుకుతున్నారు.