New Delhi, June 8: పార్లమెంటులో పెద్దల సభగా, ఎగువ సభగా పేరున్న రాజ్యసభకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 15 రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల (Rajya Sabha Elections 2022) ద్వారా 57 స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వీరంతా ఏ పోటీ లేకుండానే పెద్దల సభకు (2022 Rajya Sabha Elections) ఎన్నికయ్యారు.
హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఇద్దరు మీడియా దిగ్గజాలు ఈ ఏడాది రాజ్యసభ బరిలో నిలవడం ఆసక్తి రేపుతోంది. కర్ణాటకలో తగిన సంఖ్యాబలం లేకపోయినా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు బిజెపి, పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, సత్తా చాటేందుకు జెడిఎస్ నాలుగో సీటు కోసం కుస్తీలు పడుతున్నాయి. మహారాష్ట్రలోనూ బిజెపి, శివసేన ఇదే రీతిలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 16 స్థానాలకు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 10న పోలింగ్ జరగనుంది.
రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాజస్థాన్‌లో సరిపడేంత సంఖ్యా లేకపోయినా కూడా 'జీటివి' ఛైర్మన్ సుభాష్ చంద్రను బిజెపి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేలను పోగేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కాజేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ బుధవారం నాడు విమర్శించారు. ఇక నామినేషన్ దాఖలు సందర్భంగా తనకు 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సుభాష్ తెలిపారు.
రాజ్యసభలో రాజస్థాన్‌కు సంబంధించి నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో ఉన్న 200 స్థానాల్లో కాంగ్రెస్‌కు 108 మంది సొంత సభ్యులున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలతో సభలో కాంగ్రెస్ సంఖ్యాబలం 126గా ఉంది. బిజెపికి కేవలం 71 మంది సభ్యులే ఉన్నారు. శాసనసభలో సంఖ్యాబలం ప్రకారం..వీటిలో రెండు స్థానాలు కాంగ్రెస్ గెల్చుకునేందుకు వీలుండగా, ఒకటి బిజెపి దక్కించుకునేందుకు అవకాశం ఉంది.
కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీని నామినేట్ చేసింది. బిజెపి మాజీ ఎమ్మెల్యే ఘనశ్యామ్ తివారిని తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా అనూహ్యంగా బరిలోకి దిగిన జీటివి అధినేత సుభాష్ చంద్రకు బిజెపి మద్దతు ప్రకటించింది. దీంతో ఈ సీటు దక్కించుకోవాలంటే కాంగ్రెస్‌కు, బిజెపికి ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా అవసరం. అందుకనే సుభాష్ చంద్రకు మద్దతుగా ఇప్పుడు బిజెపి ఆపరేషన్ కమలం చేపట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి వారందర్నీ ఈ నెల 2 నుంచి ఉదయ్ పూర్‌లో ఒక హోటల్లో ఉంచిన సంగతి తెలిసిందే. బిజెపి కూడా తన ఎమ్మెల్యేలను జైపూర్ శివారుల్లోని ఒక రిసార్టుకు తరలించింది. మిగిలిన కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఇక హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలుండగా వీటిలో కాంగ్రెస్‌కు 31 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ సంఖ్యా బలంతో కాంగ్రెస్ బరిలో నిలిపిన అజయ్ మాకెన్‌ను సులువుగా విజయం సాధించేవీలుంది. 40 మంది ఎమ్మెల్యేలున్న బిజెపి మాజీ రవాణా శాఖ మంత్రి కృష్ణన్ లాల్ పన్వార్‌ను బరిలో నిలిపింది. అలాగే అయితే 'వీయాన్ న్యూస్' యజమాని కార్తీకేయ శర్మను అనూహ్యంగా బరిలో నిలిపి మద్దతు ప్రకటించింది. శర్మను గెలిపించేందుకు బిజెపి తన భాగస్వామ్య పార్టీ అయిన జననాయక్ జనతా పార్టీ (జెజెపి)పై ఆశలు పెట్టుకుంది. జెజెపికి అసెంబ్లీలో 10 స్థానాల సంఖ్యా బలం ఉంది. వీరు కాకుండా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల బరిలో ఉండటం ఇక్కడ ఆసక్తిదాయక అంశం. ఐఎన్‌ఎల్‌డికి చెందిన అభరు చౌతాలా, హర్యానా లక్‌హిత్ పార్టీకి చెందిన గోపాల్ కంద కూడా శర్మకు మద్దతు ప్రకటించారు.
ఇక కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 70 మంది ఎమ్మెల్యేలు కలిగివుంది. బిజెపికి 121 మంది ఎమ్మెల్యేలున్నారు. జెడిఎస్‌కు 32 మంది సభ్యులున్నారు. అధికార బిజెపి నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను రెండు స్థానా లను గెలుచుకునే వీలుంది. కాంగ్రెస్ ఒక స్థానా న్ని కైవసం చేసుకోవచ్చు. ఇక నాలుగో స్థానం ఇరు పార్టీలకూ కీలకంగా మారింది. దీంతో రెండు పార్టీలు చెరో అభ్యర్థిని అదనంగా బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేశ్‌ను, మనసూర్ అలీఖాన్‌ను బరిలో నిలిపింది. బిజెపి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను, నటుడు జగ్గేశ్‌ను, కర్ణాటక ఎమ్మెల్సీగా ఉన్న లహర్ సింగ్ సిరోయాను తన అభ్యర్థులుగా పోటీ చేయిస్తోంది. రియల్ ఎస్టేట్ దిగ్గజం డి కుపేంద్ర రెడ్డిని జెడిఎస్ బరిలో నిలిపింది.
ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలుండగా బిజెపి 106 స్థానాల సంఖ్యా బలం ఉంది. శివసేన 55 స్థానాలు, కాంగ్రెస్ 44, ఎన్‌సిపి 53 స్థానాలు కలిగియున్నాయి. అయితే ఎన్‌సిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ జైలులో ఉన్నందున వారికి ఓటింగ్ అవకాశం ఉండదు. చిన్నచిన్న పార్టీల సభ్యులు, స్వతంత్ర సభ్యులు కలిపి 29 మంది ఉన్నారు. బిజెపి తన తరపున ముగ్గురు అభ్యర్థులు కేంద్ర మంత్రి పియూష్ గోయల్, అనిల్ బాండే, ధనాంజరు మహదిక్‌ను పోటీలో నిలిపింది. శివసేన ఇద్దరు అభ్యర్థులు తన అధికారి ప్రతినిధి సంజరు రౌత్, సంజరు పవార్‌ను బరిలో నిలిపింది. ఇక అధికార కూటమిలో భాగంగా ఉన్న ఎన్‌సిపి మాజీ కేంద్ర మంత్రి ప్రఫూల్ పటేల్‌ను, కాంగ్రెస్ ఇమ్రాన్ ప్రతాప్‌గడిని తమతమ అభ్యర్థులుగా పోటీ చేయిస్తున్నాయి.
క్రాస్ ఓటింగ్ జరగకుండా సాధారణంగా ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడానికి అవసరమైనన్న ఓట్లు పోనూ మరో రెండు ఓట్లు మిగులుగా ఉంటాయి. ఎన్‌సిపి కి కూడా 9 ఓట్లు మిగులు ఉంటాయి. ఈ 13 మిగులు ఓట్లను ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు శివసేనకు బదిలీ చేయవచ్చు. కాగా ప్రభుత్వానికి మద్దతి స్తున్న మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ ఓటును శివసేనకు వేసే వీలుంది. కాంగ్రెస్, ఎన్‌సిపి, సేనకు చెందిన మిగులు ఓట్లు మొత్తం 24 అవుతుంది. అయితే క్రాస్ ఓటింగ్ జరిగితే ఈ అంకెలన్నీ తారు మారైపోతాయి.