New Delhi, June 10: నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక (Rajya Sabha Elections 2022) జరుగనున్నది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. తమ 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారని ఆ పార్టీలో చేరిన మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే రాజేంద్ర గూడ తెలిపారు. తమకు 126 ఓట్లు ఉన్నాయని, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. ఇప్పటికే ఈ నాలుగు రాష్ర్టాల్లో తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు పార్టీలు వారిని రిసార్టులకు తరలించాయి. కాగా, ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, శివసేనకు చెందిన సంజయ్ రౌత్ భవితవ్యం తేలనున్నది.
మహా వికాస్ అఘాడికి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుస్తారని, విజయంపై తమకు పూర్తి నమ్మకం ఉందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం జరగనున్న మహారాష్ట్ర నంఉచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది.
మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు గాను ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గత వారం ఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లోని మిగతా 16 సీట్లకు గాను (oting Underway in Four States for 16 Vacant Seats) పోటీ తీవ్రంగా ఉంది. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు.