Ayodhya, June 14: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాని (Ayodhya Ram Mandir)కి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ధ ఆలయానికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద (Jaish-E-Mohammed) సంస్థ హెచ్చరించినట్లు ఓ ఆడియో సందేశం లీక్ అయ్యింది (Audio Leaks). రామ మందిరంపై బాంబులతో దాడి చేస్తామంటూ ఆ ఆడియోలో ఉన్నట్లు జాతీయ మీడియా తాజాగా వెల్లడించింది. జైషే సంస్థ హెచ్చరికలతో అయోధ్య పోలీసులు అప్రమత్తం అయ్యారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు (Security Tightened).
మరోవైపు రామ మందిరానికి ఇలా బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. 2023లోనూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ బెదిరింపులు బూటకమని తేలింది. అంతకుముందు 2005లో రామ మందిరంపై జైషే మహ్మద్ సంస్థ దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలు నింపిన జీపుతో మందిరం వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనతో అప్పట్లో దేశ రక్షణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా జైషే మహ్మద్ ఆడియో హెచ్చరికను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.