PM Modi at Bhumi Pujan: మోదీ కొత్త నినాదం జై సియా రామ్, రాముని నినాదాలతో మార్మోగిన అయోధ్య, వందల ఏళ్ల తర్వాత నిరీక్షణ ఫలించిందని తెలిపిన ప్రధాని మోదీ
PM Narendra Modi at Ram Mandir bhumi pujan event (Photo Credits: ANI)

Ayodhya, August 5: దేశ ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అపూరూప ఘట్టానికి నేడు అంకురార్పణ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నినాదం కేవలం భారత్‌లోనే కాక ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ మహత్కార్యం సందర్భంగా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మందిర నిర్మాణానికి సంబంధించి భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు రామ్‌ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన నమో, నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన పూర్తి సమాచారం లోపల కథనంలో..

అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం దేశమంతా పోరాటం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే రామమందిరం కోసం ఎందరో పోరాటం చేశారు. బలిదానాలు చేశారు. వారందరి త్యాగాలతోనే ఈ రోజు రామమందిరం నిర్మాణం జరుగుతుందని మోదీ తెలిపారు.

నేడు ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మందిర నిర్మాణం దేశానికి ఒక ఉద్వేగభరితమైన క్షణం. ఏళ్ల తరబడి కొనసాగిన సుదీర్ఘ నిరక్షణ నేటితో ముగియనుంది. ఇన్నేళ్లు ఒక గుడారం కింద నివసించిన రాముడికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. అయోధ్య చరిత్రలో నేడు ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తుంది. ఆలయం కోట్ల మంది ప్రజల సమిష్టి తీర్మానం శక్తికి ప్రతీక. ఇది భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ నాడు దేశమంత రామమయమయ్యింది. ఈ రోజు వారందరికి దేశ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని మోదీ అన్నారు.

ప్రసంగం కంటే ముందు రామాలయం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జైశ్రీరామ్‌ నినాదాలతో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కోటాను కోట్ల మంది హిందువులకు ఈ రామాలయం నిర్మాణం ఎంతో ముఖ్యమైనది. ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు.. కానీ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తులకు వినిపిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం మహద్భాగ్యం అని అన్నారు. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు అవకాశం కల్పించిందన్నారు. రామమందిరం ఇకపై భవ్య మందిరంగా రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైంది. దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయిందని చెప్పారు. రామమందిరం నిర్మాణం ఎందరో త్యాగాల ఫలితమిది. రాముడు అందరి మనసులో నిండి ఉన్నారని మోదీ పేర్కొన్నారు.

ప్ర‌సంగం ఆరంభంలో జై సియా రామ్ 

ప్ర‌ధాని మోదీ త‌న ప్ర‌సంగం ఆరంభంలో జై సియా రామ్ అంటూ ప‌లికారు. అతివాదుల‌కు పాపుల‌ర్ స్లోగ‌న్ అయిన జై శ్రీరామ్ స్థానంలో ప్ర‌ధాని మోదీ జై సియా రామ్ అంటూ అన్నారు. భూమిపూజ‌కు హాజ‌రైన ప్ర‌తి ఒక్క‌రి చేతి ఆ నినాదాల‌ను ప‌ల్ల‌వించేలా చేశారు. సియావ‌ర్ రామ్ చంద్ర కి జై.. జై సియా రామ్ అంటూ వ్యాఖ్యానించారు. శ్రీరామ‌జ‌న్మ‌భూమి విముక్తి పొందిన‌ద‌ని, ఇన్నాళ్లూ టెంట్ కింద ఉన్న అయోధ్య రాముడి కోసం దివ్య‌మైన మందిరాన్ని నిర్మించ‌నున్న‌ట్లు మోదీ చెప్పారు. మోదీ త‌న ప్ర‌సంగంలో రామ్ స‌బ్‌కే హై, రామ్ స‌బ్ మే హై అంటూ అన్నారు. రాముడు అంద‌రివాడు, రాముడు అంద‌రిలో ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు.

అమిత్‌షా ట్వీట్

అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రధాని మోదీ బలమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని సూచిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం ట్వీట్ చేశారు. ఈ రోజు మరుపురాని రోజు అని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు. భారతీయ సంస్కృతిని, దాని విలువలను కాపాడడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. ఆలయ నిర్మాణం అసంఖ్యాక భక్తుల త్యాగం, పోరాటం, తపస్సుల ఫలితమని, వారందర్నీ ఈ సందర్భంగా తలుచుకుంటున్నట్లు షా ట్విట్టర్ వేదికగా తెలిపారు.

‘బాబ్రీ జిందా హై’ (బాబ్రీ మసీదు ఇంకా బతికే ఉంది)

ట్విట్టర్‌లో ‘బాబ్రీ జిందా హై’ (బాబ్రీ మసీదు ఇంకా బతికే ఉంది) అనే హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండింగ్‌ అవుతోంది. నాటి బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన విషయాల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ నెటిజెన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే పరంపరలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం ఇదే హ్యాష్‌ట్యాగ్‌పై ట్వీట్ చేశారు. బాబ్రీ మసీదు పాత చిత్రం, మసీదు కూల్చివేత సమయంలో తీసిన చిత్రం.. రెండింటినీ కలిపి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం ‘‘బాబ్రీ మసీదు ఉండేది.. ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. దానితో పాటు‘బాబ్రీ జిందా హై’ అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.