File Image of Ram Vilas Paswan | (Photo-ANI)

New Delhi, October 9: కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత దిగ్గజం రామ్ విలాస్ పాస్వాన్ (74) గురువారం సాయంత్రం ఆనారోగ్యంతో దిల్లీలో కన్నుమూశారు. ఇటీవలే గుండెకు సర్జరీ చేయించుకున్న ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు అనుకున్న దశలో అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం తిరగబడింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

"పాపా ... ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేరు కానీ మీరు ఎక్కడ ఉన్నా మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ పాపా" అని తన తండ్రితో తన అనుబంధాన్ని తెలిపే చిన్ననాటి ఫోటోను ఆయన షేర్ చేశారు.

పాస్వాన్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర కేబినేట్ మంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు.

"దేశం ఒక దార్శనికత కలిగిన నేతను కోల్పోయింది. రామ్ విలాస్ పాస్వన్ ఎంతో చురుకైన వ్యక్తి,  అత్యంత అనుభవజ్ఞుడైన పార్లమెంట్ సభ్యుడు, పేద, అణగారిన వర్గాలకు ఆయన గొంతుకగా ఉండేవారు, ఇప్పుడు ఆయన లేమి బాధాకరం" అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.

ప్రధాని మాట్లాడుతూ "నేను మంచి స్నేహితుడిని, ఒక విలువైన సహోద్యోగిని కోల్పోయాను, ఇది నాకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు. ప్రతి పేదవాడు గౌరవంగా బ్రతకాలని పాస్వన్ ఎంతగానో తపించేవారు" అని మోదీ అన్నారు.

PM Modi Tweet:

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని తెలంగాణ సీఎం అన్నారు. పాస్వన్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక రామ్ విలాస్ పాస్వాన్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని, ఆయన మృతికి గౌరవ సూచకంగా శుక్రవారం రోజున దేశ రాజధాని దిల్లీ సహా, అన్ని రాష్ట్ర రాజధానులలో జాతీయ జెండాను ఎగురవేస్తామని హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, పాస్వన్ అంత్యక్రియలు శనివారం పాట్నాలో నిర్వహించనున్నారు.