Chandrayaan 3 (PIC@ X)

Bangalore, AUG 23: భారత్‌ మరో చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దృక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యింది. అనంతరం ఇస్రోకు ఒక సందేశాన్ని చేరవేసింది. ‘నేను నా గమ్యాన్ని చేరుకున్నా. మీరు (భారత్‌, ఇస్రో) కూడా’. అన్న మెసేజ్‌ను పంపింది. ఇస్రో దీనిని ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ‘భారతదేశానికి అభినందనలు’ అని ట్వీట్‌ చేసింది.

మరోవైపు చంద్రయాన్‌-3 మూన్‌పై ల్యాండ్‌ కావడాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేసింది. బుధవారం సాయంత్రం 5.20 గంటలకు లైవ్‌ ప్రసారం ప్రారంభమైంది. సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ సురక్షితంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యింది. దీంతో మూన్‌ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు చంద్రుడిపై దిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ చేరింది.

Modi Telephoned ISRO Chief: ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా! ఇస్రో ఛైర్మన్‌కు ఫోన్‌ చేసి  శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, భారత్ సృష్టించిందంటూ హర్షం 

కాగా, భారత్‌ రూ.600 కోట్ల వ్యయంతో చంద్రయాన్-3 మిషన్ చేపట్టింది. జూలై 14న లాంచ్ వెహికల్ మార్క్-III రాకెట్‌ ద్వారా దీనిని నింగిలోకి ఇస్రో పంపింది. 41 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన చంద్రయాన్‌-3 ఎట్టకేలకు ఆగస్ట్‌ 23న సాయంత్రం 6 గంటలకు దాని గమ్యమైన చంద్రుడి దక్షిణ ధృవంపై సురక్షితంగా దిగింది. ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి రోవర్‌ బయటకు రానున్నది. సుమారు 14 రోజులపాటు చంద్రుడిపై పలు పరిశోధనలు చేస్తుంది. ఎవరికీ తెలియని చంద్రుడి దక్షిణ ధృవం గుట్టు విప్పనున్నది. అక్కడి నేలలోని ఖనిజాలను గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపనున్నది.