Supreme Court (Photo-ANI)

New Delhi, August 31: ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగుతోంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసననం విచారిస్తోంది. కాగా 5 ఆగస్టు 2019లో కేంద్రం రద్దు చేసిన ఈ అధికరణతో జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదాను కోల్పోయింది.

కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత విచారణలో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని (Ready for J&K polls any time now) సుప్రీంకోర్టుకు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం గురువారం బదులిచ్చింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి అవసరమైన నియామవళిని రూపొందిస్తున్నామని, కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది.

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్దరణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు, సరైన గడువు ఇవ్వలేమని, కేంద్ర పాలిత ప్రాంత హోదా తాత్కాలికమేనని సుప్రీంకోర్టుకు స్పష్టం

దేశంలో అందరినీ సమానంగా చూసేలా, వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చే రాజ్యాంగ మార్పును తప్పుబట్టలేమంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జమ్ము కశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం. పోలింగ్ తేదీలను కేంద్ర, రాష్ట్ర ఎన్నికలసంఘాలు ప్రకటించాలి. ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేయాలాని ధర్మాసనానికి తెలిపారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే ఉంచనున్నామని, లఢక్‌ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని కోర్టుకు ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంలో కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనుంది. నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకోర్టుకు నివేదించనుంది.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది.