New Delhi, October 28: దేశ రాజధాని దిల్లీలో గాలి పూర్తిగా కలిషితం అవుతోంది. ఈ పండగ సీజన్ లో వాయుకాలుష్యం మరింత పెరిగిపోయి, ప్రజలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మరియు మరో కేబినేట్ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాహనాల ద్వారా కలిగే వాయుకాలుష్యాన్ని తగ్గించేలా ఈరోజు దిల్లీ గేట్ వద్ద 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారాన్ని ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినపుడు వాహనదారులు తమ వాహనాల ఇంజిన్ ను ఆఫ్ చేసేలా తమ చుట్టూ ఉండే కనీసం 5 మంది వాహనదారులను చైతన్య పరచటమే ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
దిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. నవంబర్ 2 నుండి దిల్లీలోని మొత్తం 272 వార్డులలో ఈ 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' క్యాంపైన్ నిర్వహించబడుతుందని మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈరోజు ప్రచారానికి సహచర కేబినెట్ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ నాయకత్వం వహిస్తున్నారు, రాబోయే రోజుల్లో, ఇతర క్యాబినెట్ మంత్రులు అవగాహన కల్పించడానికి బాధ్యత తీసుకుంటారని గోపాల్ రాయ్ తెలిపారు.
నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంలో దిల్లీ ప్రజలు తమ వంతు సహకారం అందించాలని గోపాల్ రాయ్ ప్రజలను కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉండేటపుడు తమ చుట్టూ ఉన్న వారిని ఇంజిన్ ఆఫ్ చేయించాలని మరియు తమ స్నేహితులకు, పరిచయస్తులకు ఈ క్యాంపైన్ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే దిల్లీ అంతటా అన్ని ట్రాఫిక్ సిగ్నల్ క్రాసింగ్ల వద్ద పర్యావరణ మార్షల్స్‌ను నియమించామని తెలిపిన మంత్రి గోపాల్ రాయ్, దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ప్రజల నుంచి మద్ధతు కోరుతున్నట్లు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ "దిల్లీ ప్రజలు ఇంతకుముందు కొన్ని ప్రశంసనీయమైన పనులు చేసారు, ఈసారి కూడా వారు కాలుష్యాన్ని ఓడిస్తారని నాకు నమ్మకం ఉంది. రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ క్యాంపైన్ గురించి అవగాహన కల్పించడంలో టీమ్ ఉమెన్ మార్షల్స్ ముందడుగు వేశారు" అని గోపాల్ రాయ్ అన్నారు.
మరో మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ "నేను దిల్లీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను, మీ చుట్టూ కనీసం ఐదుగురు వ్యక్తులకు ఈ క్యాంపైన్ గురించి అవగాహన కల్పించాలి మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వారి వాహనాలను స్విచ్ ఆఫ్ చేయడానికి వారిని ప్రేరేపించాలి. అది బైక్, కారు, ఆటో లేదా ఏ వాహనం అయినా అవ్వొచ్చు. ఇలా చేయడం ద్వారా దిల్లీలో కనీసం 15-20% కాలుష్యాన్ని తగ్గించవచ్చు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడం కోసం దిల్లీ ప్రజలు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. ఇప్పటికే చాలా మంది రెడ్ లైట్ పడినపుడు తమ వాహనాన్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నారు" అని అన్నారు.