Maharashtra: కరోనాతో మహిళ మృతి, ఆస్పత్రిని తగలబెట్టబోయిన మృతురాలి బంధువులు, మృతదేహాన్ని అప్పగించడం లేదని, రూ .1.5 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తోందని ఆరోపణ, మహారాష్ట్రలో వారాంతాల్లో లాక్‌డౌన్‌
DCP Lohit Matani (Photo-ANI)

Mumbai, April 5: మహారాష్ట్రలోని నాగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన మృతురాలి బంధువులు ఆసుపత్రిలోని పలు వస్తువులను ధ్వంసం చేయడంతోపాటు ఆసుపత్రికి నిప్పుపెట్టే ప్రయత్నం (Set Fire to Hospital in Nagpur) చేశారు. బంధువల్లో ఒకరు పెట్రోల్ తెచ్చి రిసెప్షన్ టేబుల్‌కు నిప్పంటించారు. వెంటనే ఆసుపత్రి అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటన సిసిటివిలో నమోదైంది.

ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ మహిళ మృతి చెందిదని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆసుపత్రిపై దాడికి పాల్పడిన ఉదంతంలో పోలీసులు మృతురాలి బంధువులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పదిమందిని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా డీసీపీ లోహిత్ మాతానీ (DCP Lohit Matani) మాట్లాడుతూ నాగపూర్‌లోని హోప్ ఆసుపత్రిలో 29 ఏళ్ల మహిళ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందిదని, దీంతో మృతురాలి భర్త, బంధువులు, స్నేహితులు అక్కడి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. తరువాత ఆసుపత్రిలోని పలు వస్తువులను ధ్వంసం చేశారని తెలిపారు.ఆమె మరణం తరువాత ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని అప్పగించడం లేదని, సుమారు రూ .1.5 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారు.

భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం, తొలిసారిగా లక్ష దాటిన కరోనా కేసులు, పలు రాష్ట్రాల్లో మినీ లాక్‌‌డౌన్‌ అమల్లోకి, అయిదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ప్రధాని మోదీ

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వచ్చే శుక్రవారం నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయి. వారంతపు లాక్‌డౌన్‌తో పాటు రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ కొనసాగనున్నది. వారమంతా పగటిపూట 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. దీంతో ఐదుగురి కంటే ఎక్కువమంది ఒకచోట కలిసి ఉండకూడదు. ఈ ఆంక్షలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయి.

షాపింగ్‌ మాల్స్‌, బార్లు, రెస్టారెంట్లు, చిన్న దుకాణాలకు పార్శిళ్లు ఇవ్వడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. పని ప్రదేశాల్లో కార్మికులకు నివాస సదుపాయం ఉంటేనే భవన నిర్మాణాలను అనుమతిస్తారు. సినిమా, డ్రామా థియేటర్లు, పార్కులు, క్రీడా మైదానాలను తెరువరు. పరిమిత సిబ్బందితో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్వోపీలు) పాటించాలి. ప్రజా రవాణా వ్యవస్థ యథావిధిగా పనిచేస్తుంది. మరోవైపు, కరోనా కట్టడికి మైక్రో (చిన్నపాటి) లాక్‌డౌన్లు అవసరమని ఢిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు రణదీప్‌ గులేరియా సూచించారు.