Mumbai, December 2: యూజర్లకి జియో మరో షాకిచ్చింది. ఇటీవల ఐయూసీ ఛార్జీలు అంటూ ప్యాక్‌లలో మార్పులు తెచ్చిన జియో(Reliance Jio) మరోసారి ధరలు పెంచింది. కొత్తగా రానున్న ప్యాక్( New Tariff Plans) లతో ఆల్ ఇన్ వన్ ప్లాన్(All In One Plan)లలో అన్ లిమిటెడ్ వాయీస్ కాలింగ్, అన్ లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఏ ఇతర నెట్‌వర్క్‌లకైనా ఉచితంగా ఎంతసేపటి వరకైనా మాట్లాడుకోవచ్చు.
ఇదిలా ఉంటే వొడాఫోన్ ఐడియా(Vodafone Idea), భారతీ ఎయిర్‌టెల్ (AIrtel) తర్వాత రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్(Reliance Jio New Tariff Plans)లను ప్రకటించింది. కొత్త టారిఫ్ ప్లాన్‌లను బట్టి 40శాతం ధరలు పెరగనున్నాయి. డిసెంబరు 6 నుంచి రిలయన్స్ జియో అందిస్తున్న ఆల్ ఇన్ వన్ ప్యాక్‌లలోనూ మార్పులు ఉంటాయని ప్రకటించింది.
భారతీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్. వోడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా టారిఫ్ ధరలను పెంచాయి. పెరిగిన టారిఫ్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎయిర్ టెల్, వొడా ఫోన్, ఐడియా రేట్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుండగా, జియో రేట్లు 6 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త ప్లాన్లు, పాతప్లాన్ల కంటే దాదాపు 42-50 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లు నెల రోజుల పాటు నెట్‌వర్క్ సేవలను పొందాలంటే కనీసంగా రూ.49 చెల్లించాల్సి ఉంటుంది.
మారుతున్న ప్రభుత్వ విధానాలతో టెలికాం కంపెనీల పై భారం పడటంతో కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై వేయడానికి సిధ్ధమవుతున్నాయి. సవరించిన స్థూల రాబడుల (ఏజీఆర్)కు సంబంధించిన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లపై భారం పడింది. వొడాఫోన్, ఐడియా రూ.44,150 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
ఇక ఎయిర్‌టెల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.35,586 కోట్ల వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ కూడా సెప్టెంబరు త్రైమాసికానికి రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి టెలికం కంపెనీలు చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. ఐదేళ్ల తర్వాత టెలికాం కంపెనీలు మొదటిసారిగా మొబైల్ చార్జీలను పెంచుతున్నాయి.