New Delhi, Jan 9: బలవంతపు మత మార్పిడిలపై అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యా వేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. మతమార్పిడి ఓ సిరీయస్ అంశమని, దానికి రాజకీయ రంగు పూయరాదు అని పేర్కొన్నది. మత మార్పిడులను అరికట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని సుప్రీంకోర్టు కోరింది. జస్టిస్ ఎంఆర్ షా, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
బెదిరింపులు, మోసం, గిఫ్ట్‌లతో ఆకట్టుకోవడం లాంటి చర్యలతో మతమార్పుడులకు పాల్పడుతున్నారని వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది. ఈ అంశంలో కోర్టుకు సహకరించాలని అటార్నీ జనరల్‌ను సుప్రీం కోరింది. భయం, మోసం, ఆకర్షణతో మతవిశ్వాసాల్ని మార్చివేస్తే అప్పుడు విపత్కర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. బలవంతపు మార్పుడల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ సీరియస్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగాలని కోర్టు సూచించింది.