New Delhi, June 8: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా వ్యాక్సిన్లకు కొత్త మార్గదర్శకాలను (Revised COVID-19 Vaccination Policy Guidelines Issued by Centre) ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నారు.ఈ మేరకు జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై (National COVID Vaccination Program) మంగళవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ (COVID-19 Vaccination) సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.
టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోత ఉండొచ్చని హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి వెల్లడించాలని సూచించింది. ఈ నూతన మార్గదర్శకాలు జూన్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజే ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.
ఇదిలా ఉంటే పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జార్ఖండ్‌లో అత్యధికంగా 37 శాతం వ్యాక్సిన్ వృథా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చత్తీస్‌గఢ్ (30 శాతం), తమిళనాడు (15.5 శాతం), జమ్ముకశ్మీర్ (10.8 శాతం), మధ్యప్రదేశ్ (10.7 శాతం) ఉన్నాయి. వ్యాక్సిన్ల వృథాలో జాతీయ సగటు 6.3 శాతం కాగా.. ఈ రాష్ట్రాలు అంతకన్నా ఎక్కువగా వృథా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
Here's Revised COVID-19 Vaccination Policy Guidelines
Price of vaccine doses for private hospitals to be declared by each vaccine manufacturer; within population group of citizens over 18 years of age,
States/UTs may decide their own prioritization factoring in vaccine supply schedule, as per the guidelines
— ANI (@ANI) June 8, 2021
టీకా పంపిణీపై నూతన మార్గదర్శకాలివే..
1. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత ఆధారంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్నాయి.
2. టీకా పంపిణీలో ప్రాధాన్యత ఎలాగంటే.. 1. ఆరోగ్య కార్యకర్తలు 2. ఫ్రంట్‌లైన్ వర్కర్లు 3. 45ఏళ్లు పైబడిన పౌరులు 4. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు 5. 18ఏళ్ల పైబడినవారు.
3. 18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ షెడ్యూల్ చేపట్టాలి. వీళ్లలో ప్రాధాన్యతా క్రమం నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే ఉంటుంది.
4. కేంద్ర ప్రభుత్వం అందించే టీకా డోసుల్లో రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌లో వృద్ధి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తాం. రాష్ట్రాల్లోని టీకా వృథా.. కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
5. టీకా డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇస్తాం. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలి. ప్రజలకు కూడా తెలియజేయాలి.
6.దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 25శాతం నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకునే వీలు కల్పించాం. ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే డోసుల ధరలకు తయారీదారులు ముందుగానే ప్రకటించాలి. టీకాలపై ఛార్జీలను కూడా వెల్లడించాలి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరపై సేవా రుసుం గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఈ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించవచ్చు.
7.కొవిన్ నమోదుతో పాటు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి.
8. కాల్ సెంటర్లు, కామన్ సర్వీసు సెంటర్ల ద్వారా టీకా ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి.