Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, June 7: కరోనా వైరస్‌ నివారణకు కీలక అస్త్రమైన వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకాలు (Free Vaccination for 18-44 Age Groups) పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియ చేపట్టి నవంబర్‌ నాటికి 80 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తాం. సొంత ఖర్చుతో టీకా వేసుకొని వారికి ప్రైవేటులో అవకాశం ఉంటుంది. టీకాల్లో 25శాతం ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంటాయి. రూ.150 సర్వీస్‌ ఛార్జితో ప్రైవేటులోనూ టీకా వేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని.. రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని స్పష్టంచేశారు. వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడానన్న ఆయన.. టీకా కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు.

వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. సెకండ్‌ వేవ్‌ కంటే ముందే ఫ్రంట్‌లైన్‌ యోధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్టు మోదీ తన ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం 25 శాతం వ్యాక్సినేషన్ వర్క్ రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు కేంద్రమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుందని, రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు.

గడిచిన వందేళ్లలో అత్యంత ఘోరమైన విషాదం, గతంలో ఇలాంటిది చూడలేదు, అనుభవించలేదు, కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న వేళ జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఇక ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు ప్రకటించారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్ అందుకుంటారని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది కూడా కోవిడ్ సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్‌ను కేంద్రం అమలు చేసింది.

స్వదేశీ వ్యాక్సిన్లతో ప్రపంచానికి దేశ శక్తి ఏంటో చూపగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు తక్కువే ఉన్నాయని, వారి అవసరాలు తీరాక టీకాలు దేశానికి రావడానికి ఏళ్లు పట్టేదని మోదీ గుర్తు చేశారు. గత వందేళ్లలో ఘోరమైన విషాదమిదేనని ప్రధాని చెప్పారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు అనేక బాధలు అనుభవించారని చెప్పారు. ఇంత మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పది రెట్లకు మించి పెంచినట్లు మోదీ వెల్లడించారు.

దేశంలో కనిష్ఠస్థాయికి పడిపోయిన కేసులు, తాజాగా 1,00,636 మందికి కోవిడ్, ప్రస్తుతం 14,01,609 యాక్టివ్ కేసులు, హర్యానాలో జూన్ 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, డేరా బాబాకు కరోనా పాజిటివ్

ఆర్మీ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వేలను ఉపయోగించి ఆక్సిజన్ కొరతను తీర్చామన్నారు. ప్రస్తుతం దేశంలో ఆరు కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం పిల్లలపైన టీకా ప్రయోగాలు జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్లపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయన్నారు.

వ్యాక్సిన్లకు సంబంధించి కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, ఇలాంటి వారందరినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.