New Delhi, June 7: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ గడిచిన వందేళ్లలో వచ్చిన అతిపెద్ద మహమ్మారని భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Naredra Modi) అన్నారు. గతంలో ఇలాంటిది చూడలేదని, అనుభవించలేదని చెప్పారు. ఈ శతాబ్ధంలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం సెకండ్ వేవ్ (Covid Second Wave)తర్వాత మొదటి సారి ఆయన జాతినుద్ధేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా.. ‘‘ కరోనా వచ్చిన తర్వాత దేశంలో వైద్య రంగాన్ని బలోపేతం చేశాం. రెండో వేవ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి డిమాండ్ రాలేదు. విమానాలు, రైళ్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశాం. కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాలి. మాస్క్, భౌతిక దూరం పాటించాలి. వ్యాక్సిన్ రక్షణ కవచం లాంటిది. వ్యాక్సిన్ (Vaccine) తయారు చేసే సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా తక్కువగా ఉన్నాయి. విదేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవటం కఠినతరంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దేశంలో వందశాతం వ్యాక్సినేషన్‌కు ప్రణాళికలు రూపొందించాం. ఇందుకోసం మిషన్ ఇంద్రధనస్సును రూపొందించాం.’’ అని అన్నారు.
ప్రపంచలోని అన్ని దేశాలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. ఆధునిక కాలంలో ఇలాంటి ఈ తరహా మహమ్మారిని ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా సెకండ్ వేవ్‌తో (Coronavirus Second Wave) దేశం కఠిన పోరాటం చేస్తోందని చెప్పారు. కరోనా వల్ల ఎంతోమంది ఆప్తులను కోల్పోయామని చెప్పారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు పెంచినట్టు తెలిపారు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి 10 రెట్లు పెంచినట్టు ప్రధాని వివరించారు.
స్వదేశీ వ్యాక్సిన్లతో ప్రపంచానికి దేశ శక్తి ఏంటో చూపగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు తక్కువే ఉన్నాయని, వారి అవసరాలు తీరాక టీకాలు దేశానికి రావడానికి ఏళ్లు పట్టేదని మోదీ గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్టాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు అనేక బాధలు అనుభవించారని చెప్పారు. ఇంత మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పది రెట్లకు మించి పెంచినట్లు మోదీ వెల్లడించారు. ఆర్మీ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వేలను ఉపయోగించి ఆక్సిజన్ కొరతను తీర్చామన్నారు.
ప్రస్తుతం దేశంలో ఆరు కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం పిల్లలపైన టీకా ప్రయోగాలు జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్లపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయన్నారు.
అంతకు ముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. యూపీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల్లో గెలుపోటముల నుంచి పాఠాలు నేర్చకుంటూ కార్యక్షేత్రంలో పనిచేయాలని, వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని మోదీ వారికి మార్గనిర్దేశనం చేశారు. ‘‘గెలుపైనా, ఓటమైనా... దాని నుంచి పాఠం నేర్చుకుందాం. రాబోయే ఎన్నికలకు ఈ పునాదులపైనే శ్రమిద్దాం. వీటిని విశ్లేషించుకుంటూనే ఎన్నికల్లో పనిచేద్దాం’’ అని మోదీ సూచించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన నేతలు, కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
.