Mumbai, October 9: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నేడు పలు కీలక ప్రకటనలు చేసింది. ద్వైమాసిక ద్రవ్య పరపతికి సమీక్షకు సంబంధించిన నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. కీలకమైన వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. రెపో రేటును 4 శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అలాగే మరికొంత కాలంపాటు 'అకామిడేటివ్' విధానాన్ని కొనసాగించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఈరోజు జరిగిన ఆర్బీఐ సమీక్ష పూర్తిగా వడ్డీ రేట్లు మార్చకుండా ఉంచడంపైనే కేంద్రీకరించగా, గవర్నర్ శక్తికాంత దాస్ మరో ప్రధాన ప్రకటన చేశారు - ఆన్‌లైన్ ఫండ్ బదిలీని సజావుగా చేయడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్) చెల్లింపు వ్యవస్థను డిసెంబర్ 2020 నుండి 24/7 అందుబాటులో ఉంచబోతున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకులు పనిచేసే దినాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో నెఫ్ట్ మరియు ఆర్‌టిజిఎస్ అనేవి సత్వరమే నగదు బదిలీకి ఉపయోగించే విధ్జానాలు. ఒకవేళ పరిమితికి మించి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరపాల్సి వస్తే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ఉపయోగించాల్సి ఉంటుంది. నెఫ్ట్ ద్వారా నగదు ట్రాన్సాక్షన్ కు కనీస పరిమితి అంటూ ఏమి లేదు అయితే సాధారణంగా కనీసం రూ .2 లక్షల నగదు బదిలీకి ఆర్‌టిజిఎస్ ద్వారా అనుమతించబడుతుంది. అయా బ్యాంకులను బట్టి పరిమితి నిర్ధారించబడి ఉంటుంది. నెఫ్ట్ విధానంలో నగదు బదిలీ అవ్వటానికి కొంత సమయం పట్టొచ్చు అదే ఆర్‌టిజిఎస్ ద్వారా తక్షణమే నగదు బదిలీ చేయవచ్చు.