COVID-19: వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్న రూమర్స్. కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మూతపడిందని వదంతులు. పుకార్లనీ కొట్టిపారేసిన తెలంగాణ ఐటీ మరియు పోలీస్ విభాగం
Coronavirus Outbreak (Photo Credits: IANS)

Hyderabad, March 5: హైదరాబాద్‌లో కరోనావైరస్ భయం కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరలేపుతున్నారు. కరోనా ప్రభావంతో హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ (Hyderabad IT Industry)  మూసివేస్తున్నారని వస్తున్న వార్తలను తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.

మైండ్‌స్పేస్ భవనంలోని ఒక కంపెనీలో పని చేసే ఒక మహిళా టెక్కీకి COVID-19 ఉందని అనుమానించడంతో ఆ కంపెనీ మిగతా ఉద్యోగులకు బుధవారం ఒకరోజు సెలవు / వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి, ఆఫీస్ ను కెమికల్ క్లీనింగ్ చేస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్ పంపించింది. దీంతో ఒకరితర్వాత ఒకరు కరోనావైరస్ కంటే వేగంగా ఈ వార్తను వైరల్ చేశారు. ఈ ప్రచారం క్రమంగా పెరిగి, ఏకంగా ఐటీ ఇండస్ట్రీనే మూసివేస్తున్నారనే ప్రచారం మొదలైంది.  కరోనావైరస్ గురించి భయపడకండి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం

మైండ్‌స్పేస్ లో మొత్తం 21 భవనాలు ఉన్నాయి. అందులోనే ఒక 12 అంతస్థులు భవనం ఉంది. ఆ ఒక్క భవనంలోనే సుమారు 11 కంపెనీలు ఉన్నాయి, 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 9వ ఫ్లోర్ లోని సుమారు 350 ఉద్యోగులు ఉండే డీఎస్ఎం కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ప్రాజెక్ట్ పనిమీద ఇటీవల ఇటలీ వెళ్లి వచ్చింది. అయితే, రెండు- మూడు రోజులుగా జ్వరం మరియు ఫ్లూతో బాధపడుతున్న ఆమె, కరోనా అనుమానంతో తన భర్తతో కలిసి గాంధీ ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు, ఇప్పటికీ వారి రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వైరస్ నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ డీఎస్ఎం కంపెనీ ముందుజాగ్రత్త చర్యగా ఆఫీస్ శుద్ధి కార్యక్రమం చేపట్టింది. అయితే గురువారం నుంచి యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. కానీ, పుకార్లు వ్యాపించడంతో కొందరు ఉద్యోగులు సెలవులు తీసుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకుంటున్నారు.  కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ క్రమంలోనే ఐటీ సెక్రెటరీ మరియు కమీషనర్ సజ్జనార్ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఎప్పట్లాగే తమ పనిని కొనసాగించండంటూ పిలుపునిచ్చారు. పుకార్లతో ఉద్యోగులకు సెలవులు ప్రకటించవద్దని ఐటీ కంపెనీలకు వారు సూచించారు.