New Delhi, Jan 6: దేశంలో గే సెక్స్ వివాహాలపై (Same-Sex Marriages) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వలింగ సంపర్క పెళ్లిళ్లకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. సుప్రీంకోర్టుకే బదిలీ చేశారు. వీటిపై ఫిబ్రవరి 15లోగా తమ స్పందన తెలపాలని కేంద్రాన్ని (Center) ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి మార్చిలో విచారించనున్నట్లు సీజేఐ (CJI) పేర్కొన్నారు.
పిటిషనర్లు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో (Supreme Court) వాదనలు విన్పించే పరిస్థితి లేకపోతే.. వారు ఉన్న చోటు నుంచే వర్చువల్‌గా అయినా ఈ కేసుపై వాదించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషనర్లు, కేంద్రం చర్చించి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని తీర్పులో తెలిపింది. పిటిషన్లలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టకుండా అన్నింటీని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.
కాగా భారత్‌లో స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దత లేదు. ఇద్దరు పురుషులు లేదా స్త్రీలు పెళ్లి చేసుకుంటే చట్టపరంగా అది చెల్లదు. అయినా చాలా మంది స్వలింగసంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు. భారీఎత్తున సెలబ్రేట్ చేసుకుని ఒక్కటైన సందర్భాలు సోషల్ మీడియాలో ఫోటోల రూపంలో దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలోనే గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలని దేశంలోని వివిధ హైకోర్టుల్లో (Different High Courts Across Country) పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటన్నింటిని కలిపి సుప్రీంకోర్టే మార్చిలో విచారిస్తామని చెప్పింది.