Mumbai November 05: ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది ఎన్‌సీబీ. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న సమీర్ వాంఖడేను దర్యాప్తు నుంచి తప్పించింది. ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌సీబీ డీజీ ప్రకటించారు. ప్రస్తుతం సమీర్ వాంఖడే ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్ కేసును ప్రస్తుతం వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ ముంబయి జోన్ ఆర్యన్ ఖాన్‌ కేసును విచారిస్తుంది. అయితే ఈ కేసును ఇకపై ఎన్‌సీబీ సెంట్రల్‌ యూనిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఆరు కేసులను సెంట్రల్‌ యూనిట్‌కు బదలాయించారు. ఇకపై ఈ కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది.

 

డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాంఖడే కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారని ఆరోపించారు. ఆయన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించారంటూ పలు ఆరోపణలు చేశారు. దీంతో వాంఖడే మతంపై కూడా చర్చ జరిగింది. మరోవైపు ఆర్యన్‌ఖాన్‌ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సాయీల్‌ అనే వ్యక్తి కూడా వాంఖడేపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ఖాన్‌ కేసులో ఎన్‌సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాలన్నారని చెప్పారు.

వాంఖడేను వివాదాలు చుట్టుముట్టడంతో, ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న సమీర్‌ వాంఖడేతో పాటు మరికొందరిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్యన్‌ఖాన్‌ కేసు నుంచి వాంఖడేను తప్పించారు.

అటు ఆర్యన్‌ఖాన్‌ కేసు నుంచి వాంఖడేను తప్పించడంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ స్పందించారు. కేవలం ఐదు కేసుల నుంచే కాదు.. 26 కేసులపైనా దర్యాప్తు చేయాలంటూ ట్వీట్‌ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఈ వ్యవస్థను శుభ్రం చేయడానికి చేయాల్సింది చాలా ఉందని, చేసి తీరుతామన్నారు.

అయితే ఆర్యన్‌ఖాన్‌ కేసు నుంచి తప్పించడంపై వాంఖడే స్పందించారు. ఈ కేసులో తనను తొలగించలేదని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాల్సిందిగా తానే కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసినట్లు చెప్పారు. ఆర్యన్‌ ఖాన్‌, సమీర్‌ ఖాన్‌ కేసును దిల్లీ ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ఈ కేసు విచారణ నుంచి తప్పించినప్పటికీ ఎన్‌సీబీ ముంబయి జోన్‌ డైరెక్టర్‌గా వాంఖడేనే కొనసాగనున్నారు.

 

అక్టోబర్ 3న ముంబైలో ఓ క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా ఎన్‌సీబీ అధికారులు దాడి చేశారు. ఇందులో షారూక్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌తో పాటూ, పలువురిని అరెస్ట్ చేశారు. అయితే పలుమార్లు బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత ఇటీవలే ఆర్యన్‌కు బెయిల్ మంజూరైంది.