Hyderabad, August 29: సంజీవయ్య పార్కును ప్రత్యేకంగా పిల్లల ఉద్యానవనంగా మారుస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్కు పేరును "సంజీవయ్య పిల్లల ఉద్యానవనం" గా మార్పు చేసింది. గురువారం నుంచి సంజీవయ్య పార్కులోకి ప్రేమికులకు అనుమతిని నిషేధించింది. 14 ఏళ్ల వయసు నిండిన టీనేజి పిల్లలు పార్కులోకి అనుమతించబడరు, అయితే వారి తల్లిదండ్రులు, పెద్దలతో వస్తే మాత్రం పార్కులోకి అనుమతించబడతారు. పార్కు ప్రవేశ రుసుంను కూడా రూ. 10కి తగ్గించారు.
హైదరాబాద్ సిటీ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన్ని ఆనుకొని సంజీవయ్య పార్కు ఉంది. ఈ పార్కులో భారీ జాతీయ జెండా ప్రాంగణంతో పాటు హెర్బల్ గార్డెన్, గులాబి తోట, సీతాకోక చిలుకల తోట అన్ని కలిపి సంజీవయ్య పార్కుగా విస్తరించబడింది. ఇన్ని ఆకర్శణలు ఉన్న నేపథ్యంలో ఈ పార్కుకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రేమికులు ఎక్కువగా ఈ పార్కులో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ఈ క్రమంలో కొంతమంది ప్రేమికుల విపరీత ధోరణి మిగతా సందర్శకులకు ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా రోజ్ గార్డెన్, బట్టర్ ఫ్లై గార్డెన్ లకు కూడా నష్టం జరుగుతున్నట్లు పార్క్ సిబ్బంది గుర్తించారు. వీటిని అరికట్టడానికి హెచ్ఎండీఎ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై సంజీవయ్య పార్కులోకి 14 ఏళ్లలోపు పిల్లలకు, పిల్లలతో వచ్చే తల్లిదండ్రులను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వారి ఉపాధ్యాలతో కలిసి వస్తే వారికి ప్రవేశం ఉచితం. సైన్స్ పట్ల పిల్లలో మరింత విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా పార్కును మరింత అభివృద్ధి చేయబోతున్నట్లు హెచ్ఎండీఎ సెక్రెటరీ రామ్ కిషన్ పేర్కొన్నారు.
కాగా, ఉదయం వేళలో జాగింగ్, ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకునేవారికి వీలుగా అన్ని వయసుల వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటలవరకు ఎవరైనా పార్కులోకి అనుమతించబడతారు. ఉదయం 9 నుంచి 6 గంటలకు వరకు మాత్రం పైన చెప్పిన విధంగా పిల్లలకు మాత్రమే అనుమతించనున్నారు.