దేశంలోని అతిపెద్ద రుణదాత, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ ఉద్యోగాల జాతరకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బ్యాంక్ ఇబ్బందులు లేని కస్టమర్ సేవను అందించడానికి అలాగే దాని డిజిటల్ ఛానెల్‌ల స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సాంకేతికతలో గణనీయంగా పెట్టుబడి పెట్టింది.
దీనిపై ఎస్ బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పందించారు. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 22,542 ఎస్ బీఐ బ్రాంచిలు ఉన్నాయని, ఇప్పుడు మరో 600 బ్రాంచిలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మార్చి నాటికి 2.32 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని... తాజాగా మరో 10 వేల ఉద్యోగుల అవసరం ఉందని చల్లా శ్రీనివాసులు తెలిపారు.
"మేము టెక్నాలజీ వైపు అలాగే సాధారణ బ్యాంకింగ్ వైపు మా వర్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తున్నాము. మేము ఇటీవల ఎంట్రీ లెవల్‌లో మరియు కొంచెం ఉన్నత స్థాయిలో దాదాపు 1,500 మంది టెక్నాలజీ వ్యక్తుల రిక్రూట్‌మెంట్‌లను ప్రకటించాము" అని SBI చైర్మన్ C S సెట్టీ PTI ఇంటర్యూలో చెప్పారు.