New Delhi, Sep 4: కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి (Supreme Court Raps Centre) వ్యక్తం చేసింది. కేంద్రంపై మండిపడింది.
కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం. అయినా మీరు వినడం లేదు. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి కరోనా మూడో వేవ్ కూడా ముగిసిపోతుందని (third wave will be over) జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కరోనావైరస్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్ జారీకి ( COVID death certificates) కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు.