Delhi, Nov 24: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను ముక్కలు చేసి చంపిన ఘటన (Shraddha Walker Murder Case) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే శ్రద్ధాను మర్డర్ చేసిన అఫ్తాబ్ అమీన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష చేశారు. శ్రద్ధాను ముక్కలు చేసేందుకు అతను అయిదు కత్తులు (5 Knives Used By Aaftab Poonawala) వాడినట్లు ఆ టెస్ట్‌లో తెలిపాడు.
ఆ కత్తులను కూడా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. లై డిటెక్టర్ పరీక్ష సమయంలో అఫ్తాబ్ చాలా కూల్‌గా, నార్మల్‌గా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధాను 35 ముక్కలుగా అఫ్తాబ్ నరికిన విషయం తెలిసిందే. మే 18వ తేదీన శ్రద్ధాను అఫ్తాబ్ చంపాడు. ఆమె శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లో పెట్టి కొన్ని రోజుల తర్వాత వాటిని పడేశాడు.
ఈ కేసుకు చెందిన వివరాలు మరిన్ని బయటకు వచ్చాయి. ఆఫ్తాబ్ తనను నరికి చంపుతానని బెదిరిస్తున్నట్లు 2020లోనే శ్రద్ధా పోలీసులకు లేఖ రాసింది. మహారాష్ట్రలోని తన స్వంత గ్రామమైన వాసాయిలోని తిలుంజ్ పోలీసులకు ఆ లేఖ రాసిందామె. ఇద్దరు కలిసి ఉంటున్న ఫ్లాట్‌లో తనపై అఫ్తాబ్ దాడి చేసినట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నది. అఫ్తాబ్ కుటుంబానికి అతని ప్రవర్తన గురించి తెలిసినట్లు చెప్పిందామె లేఖలో. అయితే కొన్ని రోజుల తర్వాత తమ మధ్య విబేధాలు లేవని స్థానిక పోలీసులకు ఆ జంట మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది.
తన సహ ఉద్యోగి కరణ్‌కు కూడా అఫ్తాబ్ బెదిరింపుల గురించి నవంబర్ 23, 2020 రోజున శ్రద్ధా వాట్సాప్ మెసేజ్ చేసింది. గాయమైన ముఖం ఫోటోలను కూడా ఆమె అతనికి పోస్టు చేసింది. తీవ్రంగా గాయాలు కావడంతో కొన్ని రోజులు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది.గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించాడని, చంపేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడని, ఆర్నెళ్ల నుంచి అతను కొడుతూనే ఉన్నాడని, కానీ పోలీసుల వద్దకు వెళ్లేందుకు తనకు ధైర్యం రావడం లేదని ఓ లేఖలో శ్రద్ధా పేర్కొన్నది.