New Delhi, August 26: తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత అప్ఘనిస్తాన్ లో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా అఫ్ఘాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు ప్రస్తుతం ఆ దేశంతో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు జైశంకర్, పియూష్ గోయల్ మరియు ప్రహ్లాద్ జోషిలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అక్కడి పరిస్థితులను సభ్యులకు వివరించారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, అక్కడి నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని తరలించడానికి భారత్ ప్రయత్నిస్తోంది మంత్రి తెలిపారు. అఫ్ఘాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను తరలించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ అక్కడి పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తోందని, సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈరోజు కూడా ఈ రోజు 35 మందిని వెనక్కి తీసుకువచ్చినట్లు జైశంకర్ వెల్లడించారు.
అప్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో, దేశంలో మత స్వేచ్ఛ మరియు కాబూల్ కేంద్రంగా ఆఫ్ఘన్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండేలా 2020 ఫిబ్రవరిలో తాలిబాన్ నాయకులు మరియు యూఎస్ మధ్య కుదిరిన 'దోహా ఒప్పందం' కుదిరింది. ఈ దోహ ఒప్పందానికి తాలిబాన్లు అంగీకరిస్తే యూఎస్ మరియు నాటో దేశాలు అఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటామని తెలిపాయి. అయితే ఇది జరిగి కేవలం 14 నెలల్లోనే ఆ ఒప్పందంలోని వాగ్దానాలను తాలిబాన్లు పూర్తిగా ఉల్లంఘించారని భారత ప్రభుత్వం పేర్కొంది.
ఇదిలా ఉంటే, అఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-ఎంఐఎస్‌సీ వీసా విధానాన్ని భారత్ ప్రవేశపెట్టింది. తద్వారా వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించడంతో ఇకపై ఆఫ్ఘనిస్థాన్ జాతీయులు ఈ-వీసాపై మాత్రమే భారతదేశంలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆఫ్ఘన్ జాతీయులకు సంబంధించి గతంలో జారీ చేసిన కొన్ని పాస్‌పోర్ట్‌లు గల్లంతయ్యాయన్న నివేదికలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం భారతదేశంలో లేని ఆఫ్ఘన్ జాతీయులందరికీ గతంలో జారీ చేసిన వీసాలు తక్షణం చెల్లుబాటు కానివిగా ప్రకటించడం జరిగింది. దీంతో ఇకపై భారతదేశానికి వెళ్లాలనుకునే ఆఫ్ఘన్ జాతీయులు www.indianvisaonline.gov.in లో ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.