SKM on Cm KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రైతు సంఘాల ప్రశంసలు, రైతు అమరుల జాబితాను అందిస్తామన్న సంయుక్త కిసాన్ మోర్చా, అమరులైన రైతు కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్
CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

New Delhi November 21: సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ రూ.3లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది సంయుక్త కిసాన్ మోర్చా. ఆందోళనల్లో అమరులైన 700 మంది రైతుల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

రైతు అమరులకు రూ. 3 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. చట్టాలను రద్దు చేసినట్లుగానే రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తి వేయాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు. రైతులకు సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇచ్చి, వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు రూ.3లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను సంయుక్త కిసాన్ మోర్చా రీట్వీట్ చేసింది. ఆయన నిర్ణయాన్ని స్వాగతించింది.

ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో సంయుక్త కిసాన్‌ మోర్చా సైతం సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రకటనను స్వాగతించింది. ఆందోళనలో సుమారు 700 మంది రైతులు చేసిన త్యాగాలను నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం గుర్తించనప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు.