Patna, May 27: మద్యాహ్నం భోజనంలో (Mid day meal) పురుగులు, రాళ్లు రావడం తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే బల్లి, బొద్దింక వంటి కీటకాలు కూడా కనిపించాయి. కానీ బీహార్‌లోని ఓ స్కూళ్లో పిల్లలకు వడ్డించే గిన్నెలో పాము (Snake Found In Khichdi) బయటపడింది. పాము పడ్డ ఆహారం తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లా ఫోర్బెస్‌గంజ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది ఈ ఘటన. అస్వస్థతకు గురైన పిల్లల్ని ఫోర్బ్స్‌గంజ్‌లోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
అయితే ఇది పాఠశాలలో వండిన అన్నం కాదట. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక ఎన్జీవో తయారుచేసిన ‘ఖిచ్డీ’ని పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు ఒక ప్లేటులో పాము కనిపించింది. పాఠశాలలో ఈ వార్త తెలియగానే భోజన పంపిణీని నిలిపివేశారు. అయితే అప్పటికే భోజనం చేసిన విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఫోర్బ్స్‌గంజ్ ఆసుపత్రికి తరలించారు.
ఎస్‌డిఎం, ఎస్‌డిఓ, డిఎస్పీ సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.