Thiruvananthapuram, May 2: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కేరళ (Kerala)లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం తిరునావయ-తిరూర్ మధ్య గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్వారు. రైలు కాసర్‌గడ్ నుంచి తిరువనంతపురానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రాళ్ల దాడితో రైలును తిరూర్ సమీపంలో అధికారులు నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత రైలు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఓ బోగీకి సంబంధించిన కిటికీ అద్దం పగిలినట్లు పేర్కొంది. కాగా, కేరళలో తొలి వందేభారత్ రైలును ఏప్రిల్ 25న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఖమ్మం జిల్లాలో వందేభారత్ రైలుపై దాడి... మూడు గంటల ఆలస్యం.. వీడియోతో
కాగా, గతంలోనూ విశాఖ- సికింద్రాబాద్, ఖమ్మం- విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆయా ఘటనల్లో రైలు అద్దాలు బ్రేక్ అయ్యాయి. బెంగాల్‌లోనూ వందేభారత్ రైలుపై దాడికి పాల్పడ్డారు.