Chennai, Sep 13: వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్‌పై విద్యార్థుల్లో భయాందోళన నెలకొని ఉంది. ఆ పరీక్షపై ఒత్తిడి పెంచుకుని తాజాగా తమిళనాడులో సేలంలో ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి (Student Suicide Over NEET Echoes) పాల్పడ్డాడు. ఆ విద్యార్థి ఇప్పటికే రెండుసార్లు నీట్ (NEET) రాయగా అర్హత సాధించలేకపోయాడు. ఏడాదిగా మూడోసారి నీట్‌కు శిక్షణ పొందాడు. చివరకు ఆదివారం పరీక్ష ఉండగా ఫెయిలవుతాననే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై తమిళనాడులో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా కుజయ్యూర్‌కు చెందిన ధనుశ్ (19) నీట్‌కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. తీరా ఆదివారం పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకున్నాడు. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్‌పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్ తల్లిదండ్రులు ‘నీట్ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నీట్ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్‌కు గురి చేసింది. నీట్‌కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. అనుకున్నట్లుగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET ) నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీలో సోమవారం బిల్లు (CM MK Stalin Introduces Bill) ప్రవేశపెట్టారు.
Here's CM M.K.Stalin Tweet
நீட் எனும் பலிபீடத்தில் மற்றுமொரு மரணம்!
கல்வியால் தகுதி வரட்டும்; தகுதி பெற்றால் மட்டுமே கல்வி எனும் அநீதி நீட் ஒழியட்டும்!
நாளை நீட் நிரந்தர விலக்கு சட்ட மசோதா கொண்டு வருவோம்; #NEET-ஐ இந்தியத் துணைக்கண்டத்தின் பிரச்சினையாகக் கொண்டு செல்வோம். pic.twitter.com/iAI4zm9knA
— M.K.Stalin (@mkstalin) September 12, 2021
ఇవాళ నేను NEETకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాను. మీరు కూడా గతంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందుకే ఈ తీర్మానానికి (Exempt TN from Entrance Test) మద్దతివ్వాల్సిందిగా ప్రతిపక్షాన్ని కోరుతున్నాను అని ఈ సందర్భంగా స్టాలిన్ అన్నారు. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. తమిళనాడులో NEET జరుగుతుందా లేదా తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని, చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు.
NEETపై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని విమర్శించారు. NEETను రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం. అయితే నీట్ తీర్మానానికి మద్దతిస్తున్నాం అని పళనిస్వామి అన్నారు.