New Delhi, July 8: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్‌ను (Mohammed Zubair) ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. కాగా యూపీ పోలీసులు నమోదు చేసిన కేసులో మహ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఢిల్లీలో నమోదైన కేసులో మాత్రం ఆయనకు బెయిల్ లభించలేదు. దీంతో ఓ మతం మనోభావాలను దెబ్బతీశాడనే ఆరోపణలపై మరో కేసులో అరెస్టయిన జుబేర్ ఢిల్లీ పోలీసులు కస్టడీలో కొనసాగుతారు.
యూపీ కేసులో జుబేర్ బెయిల్ పిటిషన్‌ను సీతాపూర్ కోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ ఇందిరా బెనర్జీ యూపీ ప్రభుత్వం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ జుబేర్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు (Bail to Alt News Co-Founder Mohammed Zubair) చేసినట్టు తెలిపారు. జుబేర్ ఎలాంటి ట్వీట్‌లు చేయరాదని, ఆధారాలు తారుమారు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.
కాగా హిందూ సన్యాసులను కించపరుస్తూ ట్వీట్ చేసినందుకు యూపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జూన్ 1న నమోదైన ఎఫ్ఐఆర్‌కు సంబంధించే మధ్యంతర బెయిల్ మంజూరైందని చెప్పారు. విచారణను నిలిపివేయడం, ఈ అంశంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులను సోమవారం వరకూ నిలిపివేయాలని యూపీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.
జుబేర్ నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. జుబేర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం యూపీలోని సీతాపూర్ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్టులో హాజరు పరిచే క్రమంలో పోలీసులు పలు కీలక ఆరోపణలు చేశారు. ప్రావ్దా మీడియా పేరుతో కొనసాగిస్తున్న సంస్థకు పాకిస్తాన్, సిరియా, దుబాయ్, సింగపూర్, షార్జా, అబుదాబితో పాటు పలు అమెరికా రాష్ట్రాల నుంచి విరాళాలు అందినట్లు తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా అతడికి బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం జుబైర్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో మహమ్మద్ జుబైర్ జ్యూడీషియల్ కస్టడీలోనే ఉండిపోవాల్సి వచ్చింది.