![](https://test1.latestly.com/uploads/images/2025/01/petition-filed-in-supreme-court-over-deaths-in-maha-kumbh-mela-stampede.jpg?width=380&height=214)
New Delhi, Feb 13: ఎన్నికల ముందు రాజకీయపార్టీలు ప్రకటిస్తున్న ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ఉచితాలతో (Supreme Court on election freebies) వారిని పరాన్నజీవులు (పారాసైట్స్)గా మారుస్తున్నామా అని అత్యున్నత ధర్మాసనం సందేహం వెలిబుచ్చింది. ఢిల్లీలో ఇండ్లులేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను బుధవారం విచారిస్తూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా ప్రజల్ని సమాజ ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి పాటుపడేలా చేసేబదులు ఇతరులపై ఆధారపడే ఒక వర్గాన్ని సృష్టిస్తున్నామా అని ప్రశ్నించింది.ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రకటిస్తున్న పలు పథకాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడకపోవడం (People not willing to work) దురదృష్టకరం. నిరాశ్రయులకు గూడు లేదనే మీ ఆందోళన మంచిదే. ఎలాంటి పని చేయకుండానే ప్రజలకు ‘లడ్‌కీ బహిన్’ వంటి స్కీమ్‌ల ద్వారా ఉచితంగా రేషన్, నగదు వస్తోంది’’ అని పేర్కొంది.
ఇక ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీలు అవినీతికి మార్గాలుగా పరిణమిస్తున్నాయంటూ రిటైర్డ్ జడ్జి ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారించి ఉచిత హామీలన్నీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఉచితాలపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో టాప్ కోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్‌కు సూచించింది.
నేటి సుప్రీంకోర్టు విచారణలో పని దొరికితే చేయడానికి ఇష్టపడనివారు ఎవరూ ఉండరని కక్షిదారుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. మీరు నాణేనికి ఒకవైపే చూస్తున్నట్లుంది. నేనొక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో రాజకీయ పార్టీలు ఉచితాలు ఇస్తుండటం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. ఇంటికే అన్నీ ఉచితంగా వస్తున్నప్పుడు పొలంలో పనిచేయడానికి ఎవరు ఇష్టపడుతారు? మీరే చెప్పండి..అయితే దీనిపై మేం చర్చించదలచుకోలేదు’’ అని జస్టిస్ గవాయ్ చెప్పారు.
దీంతో పాటుగా ఢిల్లీలో ప్రస్తుత షెల్టర్లలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు.. ‘‘రోడ్డుపై పడుకోవడం, నివాసయోగ్యం కాని షెల్టర్ హోమ్‌లో ఉండడం.. ఈ రెండింటిలో ఏది మెరుగు?’’ అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.దీనిపై పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు కేంద్రం ‘పట్టణ పేదరిక నిర్మూలన’ పథకాన్ని ఖరారు చేస్తోందని అటార్నీ జనరల్ ధర్మాసనానికి వెల్లడించారు. అది ఎప్పటిలోగా పూర్తవుతుందని న్యాయమూర్తులు ప్రశ్నించగా.. రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు.
దీనిపై స్పందించిన అత్యున్నత ధర్మాసనం ఆ కార్యక్రమం ఎంత కాలవ్యవధిలో అమలవుతుంది, ఏయే అంశాలుంటాయో తెలపాలని సూచించి, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.