Ayodhya Verdict Review: పున:పరిశీలించడాల్లేవ్, అదే ఫైనల్! అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్ట్, నవంబర్ 9న ఇచ్చిన తీర్పుకే కట్టుబడిన ధర్మాసనం
Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, December 13: అయోధ్య వివాదంలో నవంబర్ 9 తీర్పు (Ayodhya Verdict) ను సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లన్నింటినీ (Review Petitions)  సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. అయోధ్య తీర్పును సవాలు చేస్తూ మొత్తం 18 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై చీఫ్ జస్టిస్ ఎస్ఎ బొబ్డే (SA Bobde)  నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్‌ఐ నజీర్, డివై చంద్రచూడ్, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం అంతర్గత విచారణ (In-chamber) జరిపింది. అనంతరం మొత్తం 18 పిటిషన్లను తిరస్కరించింది.

నవంబర్ 9న జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అయోధ్యలో వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని హిందూ ట్రస్టీలకు మంజూరు చేసి, రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. దానికి బదులుగా ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని పేర్కొంటూ చారిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్ట్ వెలువరించింది.

అయితే, ఆ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అఖిల భారత ముస్లింల లాబోర్డు మరియు నిర్మోహి అఖారాతో పాటు 40 మంది ఇతర పౌర హక్కుల కార్యకర్తలు కలిసి నవంబర్ 9 తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ 18 రివ్యూ పిటిషన్లు వేశారు. తాము ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించడానికి ఈ పిటిషన్ వేయడం లేదు. ఆనాటి తీర్పు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మేము శాంతికి భంగం కలిగించేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాకపోతే, అందులో మేము బాధితులుగా మిగిలిపోయాము. కాబట్టి న్యాయం కోసమే తాము ఈ రివ్యూ పిటిషన్లను వేసినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.  రివ్యూ పిటిషన్ వేసినా, అది 100 శాతం కొట్టివేయబడుతుందని మాకు తెలుసు- ముస్లిం లాబోర్డ్

ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లనీ గురువారం సుప్రీంకోర్టులో ఇన్-ఛాంబర్ విచారణకు వచ్చాయి. సుప్రీం తాము మొదట ఇచ్చిన తీర్పుకే కటుబడుతూ ఈ రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చింది. అయోధ్య వ్యవహరంలో నవంబర్ 9న వెలువడిన తీర్పే అంతిమం అని తేల్చింది.