supreme court (Photo/ANI)

Chennai, Oct 3: స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేష‌న్‌పై తమిళనాడు పోలీసుల చ‌ర్య‌ల‌కు బ్రేక్ వేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలు ఇచ్చింది. ఈషా ఫౌండేష‌న్‌తో లింకున్న అన్ని క్రిమిన‌ల్ కేసుల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌తో త‌మిళ‌నాడు పోలీసులు (Tamil Nadu police) చ‌ర్య‌ల‌కు దిగారు. ఈ నేప‌థ్యంలో ఈషా ఫౌండేష‌న్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

విచారణ అనంతరం మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీం స్టే ఇచ్చింది. కోయంబ‌త్తూరులోని ఈషా ఫౌండేష‌న్ ఆశ్ర‌మంలో(Isha Foundation Row) ఉన్న త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌కు బ్రెయిన్‌వాష్ చేశార‌ని, దాంతో వాళ్లు ఇంటికి రావ‌డం లేద‌ని ఓ తండ్రి దాఖ‌లు చేసిన పిటీష‌న్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఈషా పౌండేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

నీ కూతురుకు పెళ్ళి చేసి ఇతర యువతుల్ని ఎందుకు స‌న్యాసినులుగా మారుస్తున్నారు, స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్‌ను ప్ర‌శ్నించిన మ‌ద్రాస్ హైకోర్టు

ఈ రోజు కేసు విచారణకు రాగా చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాసనం ఇవాళ ఈ కేసులో వాద‌న‌లు విన్న‌ది. ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో ధ‌ర్మాస‌నం మాట్లాడింది. త‌మ ఇష్ట‌పూర్వ‌కంగానే ఆశ్ర‌మంలో ఉంటున్న‌ట్లు ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు వెల్ల‌డించారు. త‌మ‌ను ఎవ‌రూ నిర్బంధించ‌డంలేద‌ని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీం ధర్మాసనం ముందుకు బదిలీ చేసింది. త‌మిళ‌నాడు పోలీసులు ఇచ్చే స్టేట‌స్ రిపోర్టును సుప్రీంకు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.

కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్‌ కామరాజ్‌ మద్రాసు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో.. తన ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈశా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారన్నారు.

ఈ విషయమై ఇదివరకే దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని కోయంబత్తూరు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ తర్వాత తమను ఇబ్బందికి గురిచేయకూడదని కుమార్తెలు సివిల్‌ కేసు వేశారని, దీంతో తాను, తన భార్య మానసికంగా ప్రభావితమైనట్లు పిటిషనర్‌ తెలిపారు.

తమ కుమార్తెలను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఈశా యోగా కేంద్రాని (Isha Foundation)కి వ్యతిరేకంగా తాను ఏ ఆందోళన చేయకూడదని, అలాచేస్తే చనిపోయేవరకు నిరాహారదీక్ష చేపడతానని తన రెండో కుమార్తె తెలిపిందన్నారు.

తమ కుమార్తెలు అక్కడినుంచి బయటికొస్తే వారిని ఇబ్బందిపెట్టమని, ప్రత్యేక స్థలం ఇచ్చి వారి ఏకాంతాన్ని కాపాడతానని, కుమార్తెలను అప్పగించాలని కోరారు. విచారణలో భాగంగా జగ్గీ వాసుదేవ్‌ తన కుమార్తెకు వివాహం చేసిన ఫొటో చూసిన న్యాయమూర్తులు.. ఇతరుల పిల్లలను సన్యాసినులుగా ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఈ పరిణామాల వేళ.. ఫౌండేషన్ (Isha Foundation) ప్రకటన విడుదల చేసింది. పెళ్లి చేసుకోమని కానీ, సన్యాసులుగా మారాలని కానీ తాము ఎవరినీ అడగమని స్పష్టం చేసింది. ఇవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయాలని పేర్కొంది. అలాగే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. సుప్రీంను ఆశ్రయించింది. ఫౌండేషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. సుమారు 150 మంది పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి, ప్రతి మూల శోధించారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని కోరిన నేపథ్యంలో.. పోలీసు చర్యలను ఆపాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.