New Delhi, Feb 15: ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)పై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం (Supreme Court) సంచలన తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుంది.
విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఎన్నికల బాండ్లపై ఏకగ్రీవ తీర్పు ఇవ్వనున్నట్లు సీజేఐ వెల్లడించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్నారు.
సరైన ఓటింగ్ ప్రక్రియను తెలుసుకునేందుకు రాజకీయ నిధుల గురించి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ అన్నారు. ఆర్టికల్ 19(ఏ)(ఏ) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపారు. ఆర్పీఏ, ఐటీ చట్టంలో 29(1)సెక్షన్ సవరణ రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసే బ్యాంకులు తక్షణమే బాండ్లను నిలిపివేయాలని కోర్టు తన తీర్పులో తెలిపింది.
నిధులు అందుకున్న రాజకీయ పార్టీలు వివరాలను ఎస్‌బీఐ బ్యాంకు వెల్లడించాలని కోర్టు కోరింది. మార్చి 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి ఆ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి బాండ్‌కు చెందిన వివరాలను ఎస్బీఐ వెల్లడించాలని తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం.మార్చి 13వ తేదీ వరకు తమ అధికారిక వెబ్‌సైట్ ఎన్నికల సంఘం ఆ సమాచారాన్ని పోస్టు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఖాతాలో జమా చేయకుంటే, వాటిని రిటర్న్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది.