New Delhi November 28: భార్యలను కొట్టడాన్ని సమర్ధించారు 14 రాష్ట్రాలకు చెందిన మహిళలు. మీరు చదివింది నిజమే! భర్త(Husband) తన భార్య(Wife)ను కొట్టడాన్నిసమర్ధిస్తారా? అన్న ప్రశ్నకు 14 రాష్ట్రాలకు చెందిన మెజార్టీ మహిళలు(Women) అవును అని సమాధానమిచ్చారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో(National Family Health Survey) ఈ విషయం వెల్లడైంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 5లో భాగంగా ‘భర్త తన భార్యను కొట్టడం లేదా దాడి చేయడాన్ని సమర్థిస్తారా?’ అన్న ప్రశ్నకు 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 30 శాతం మందికిపైగా మహిళలు ‘అవును’ అని సమాధానమిచ్చారు. కొన్ని పరిస్థితులలో ఇది సబబే అని తెలిపారు. అయితే భర్తలు కొట్టడాన్ని మహిళలు సమర్థించిన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి.
ఈ సర్వే డేటా ప్రకారం ప్రధానంగా మూడు రాష్ట్రాల్లో 75 శాతం కంటే ఎక్కువ మహిళలు, భార్యలను భర్తలు కొట్టడాన్ని ఎక్కువగా సమర్థించారు. అత్యధికంగా తెలంగాణ(Telangana )లో 84 శాతం, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 84 శాతం, కర్నాటక(Karnataka )లో 77 శాతం మంది మహిళలు భర్తల చర్యకు మద్దతు తెలిపారు. మణిపూర్(Manipur)లో 66 శాతం, కేరళ(Kerala)లో 52 శాతం, జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో 49 శాతం, మహారాష్ట్ర(Maharastra)లో 44 శాతం, పశ్చిమ బెంగాల్(West Bengal)లో 42 శాతం మహిళలు.. పురుషులు తమ భార్యలను కొట్టడాన్ని సమర్థించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ మహిళల్లో 14 శాతం మాత్రమే దీనికి మద్దతిచ్చారు.
కుటుంబం లేదా పిల్లలను నిర్లక్ష్యం చేయడం, అత్తమామల పట్ల అగౌరవంగా ఉండటం, భర్త-కుటుంబంపై అవిశ్వాసం, వాదించడం, లైంగిక సంబంధం నిరాకరించడం, భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని నిర్లక్ష్యం చేయడం, వంట సరిగా వండకపోవడం వంటివి భార్యలపై భర్తల దాడికి ముఖ్య కారణాలని ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తెలిపారు. వీటిని పాటించని భార్యలను భర్తలు కొట్టడంలో తప్పు లేదన్నారు.
అయితే ఇవన్నీ సమాజంలో మహిళలు ఎలా ప్రవర్తించాలో అన్నది నిర్వచించే పద్ధతులని ఆక్స్ ఫామ్ ఇండియా(Oxfam India)కు చెందిన జెండర్ జస్టిస్ ప్రధాన స్పెషలిస్ట్ అమితా పిత్రే(Amita Pitre) అన్నారు. మహిళలపై లింగ ఆధారిత హింసను ఆపాలంటే అలాంటి పురుషుల నుంచి మహిళలు దూరం కావడం చాలా ముఖ్యమని ఆమె చెప్పారు. మహిళలతో కలిసి పని చేస్తున్నప్పుడు హానికరమైన లింగ సామాజిక నిబంధనలు, మహిళలు-బాలికలపై హింసను సమర్థించే అంశాన్ని ఈ సర్వే ద్వారా అధ్యయనం చేసినట్లు చెప్పారు.