Swati Maliwal hunger strike: DCW chief falls unconscious, admitted to hospital (Photo-ANI)

New Delhi, December 15: మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా హక్కుల కమిషన్(DCW chief) చీఫ్ స్వాతి మాలివాల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష(Swati Maliwal Hunger Strike) 13వ రోజుకు చేరింది. దేశవ్యాప్తంగా దిశ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న స్వాతి మాలివాల్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే స్వాతిని లోక్ నాయక్ హాస్పిటల్ కి(ఎల్ఎన్ జేపీ)(Lok Nayak Hospital) తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్రం తీసుకుంటున్న చర్యలను స్వాతి మాలివాల్ తప్పుబట్టారు. దేశమంతా దిశ చట్టం (Disha Act) తీసుకొచ్చే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.నిందితులను 6 నెలల్లోనే శిక్షించేలా కేంద్రం కఠినమైన చట్టాలు తీసుకురావాలని స్వాతి మాలివాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ANI Tweet

తన డిమాండ్లపై కేంద్రం స్పందించడం లేదని, పటిష్టమైన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు, నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్వాతి మాలివాల్ స్పష్టంచేశారు. కేంద్రం నిర్భయ నిధిని నిరుపయోగంగా ఉంచిందని, వెంటనే ఆ నిధిని వినియోగంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని కోరుతూ ప్రధాని మోడీకి స్వాతి మాలివాల్ లేఖ రాశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఏపీ సర్కార్ తెచ్చిన చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ చట్టం ప్రకారం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే, 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవితఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. ఇలా చట్టాన్ని తక్షణమే దేశవ్యాప్తంగా తీసుకురావాలని...ప్రధానికి రాసిన లేఖలో స్వాతి అభ్యర్ధించారు. నవంబర్ 28న షాద్ నగర్ వద్ద జరిగిన దిశ హత్యోదంతం ఘటన అనంతరం స్వాతి మాలివాల్ నిరాహార దీక్ష చేపట్టారు.