Chennai, February 12: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించటంతో 15 మంది అక్కడికక్కడే సజీవ దహనం (Tamil Nadu Fire) అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో (Firecracker Factory Fire) మృతుల సంఖ్య 19కి చేరింది. విరుంద్‌నగర్ జిల్లాలోని అచ్చన్‌కులాం గ్రామంలో ఉన్న పటాకుల కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45 గంటలకు పేలుడు సంభవించింది.
పటాకులను తయారు చేయడానికి కొన్ని రసాయనాలను కలుపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా, ముఖ్యమంత్రి పళనిస్వామి మృతులకు రూ.3 లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ఈ మధ్యాహ్నం విరుద్‌నగర్ జిల్లా అచన్‌కులమ్‌లోని బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ ఉన్న నాలుగు షెడ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు అదుపుచేయటానికి దాదాపు 30 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాతపడగా.. ఇరవైకి పైగా మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.