తెలంగాణ రాష్ట్ర వరప్రదాయినిగా చెప్పబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలోనే ప్రాజెక్ట్ పూర్తికావడం పట్ల సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.

తొలుత మేడిగడ్డ బ్యారెజీని ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించిన సీఎం బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచి ఉండటం చూసి ఆనందపడ్డారు. ఆ తర్వాత బ్యారేజీ పొడవునా చాలా దూరం కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోదావరి నదిలో నాణేలను జార విడిచారు. మేడిగడ్డ ఎగువన ప్రాణహిత నుండి వస్తున్న వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, గేట్ల నిర్వహణ తదితర విషయాలను ఇరిగేషన్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

ఈ సీజన్ లో 300 టీఎంసీల నీరు కిందికి వెళ్లినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పై నుంచి వచ్చే వరదకు అనుగుణంగా గేట్లను ఎత్తాలని, వరద తగ్గితే గేట్స్ మూసివేయాలని సీఎం సూచించారు. వీలున్నంత వరకు ప్రాజెక్టులో నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  అదేసమయంలో ప్రాణహిత నుంచి భారీగా తరలివస్తున్న వరదనీటితో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం హెచ్చరించారు.

ఈ సందర్భంగా ధర్మపురిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను వారి రాష్ట్రంలో అమలు చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు.  రాష్ట్రంలో  నీటి కొరత, కరెంట్ కొరత ఏమాత్రం లేకుండా బంగారు, సస్యశ్యామల తెలంగాణ చేయడమే తన లక్ష్యం అని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అల్పజ్ఞానంతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాము చేసేది చేసుకుంటూ వెళ్తాం అని సీఎం స్పష్టం చేశారు.