Hyderabad, Sepember 06: తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహ ఆలయాన్ని 'తిరుమల' తరహాలో తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టింది. ఇందుకోసం దాదాపు రూ. 1,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఒక అంచనా. చిన్నజీయర్ స్వామి సూచన మేరకు ఈ ప్రాంతాన్ని యాదాద్రి (Yadadri) గా కూడా పేరు మార్చారు. సీఎం కేసీఆర్ (K. Chandrashekhar Rao) ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధి పనులను ఒక యజ్ఞంలా కొనసాగేలా చేస్తున్నారు. తనకు సమయం దొరికినప్పుడల్లా ఆలయ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది.
అయితే ఆలయంలోని స్తంభాలపై కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, అలాగే హరితహారం, కేసీఆర్ కిట్టు లాంటి ప్రభుత్వ పథకాలు కూడా ఉండటం పట్ల తీవ్ర దుమారం రేగుతుంది. హిందూ సంఘాలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నాయి, శుక్రవారం రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి.
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 11 ఎకరాల సువిశాల ఆలయ సముదాయంలో ఏడు గోపురాలు, 1,400 పర్యాటక వసతులు, కుటీరాలు, మల్టీలెవల్ పార్కింగ్ మరియు ఆలయ పూజారుల కోసం వసతి గృహాలు ఎజెండాలో ఉన్నాయి. నిర్మాణం దాదాపు 80 శాతం వరకు పూర్తయింది. ఆలయ గోడలు మరియు రాతి స్తంభాలపై తెలంగాణ సంస్కృతి, జీవనశైలికి సంబంధించిన అంశాలను శిల్పాలుగా చెక్కుతున్నారు. ఇందులో భాగంగా అష్టభుజి ప్రాకార మండపంలో ఒక స్తంభంపై కేసీఆర్ చిత్రపటాన్ని చెక్కారు, మరో శిల్పంపై కారు గుర్తు , తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర చిహ్నాలు, మరియు జాతీయ చిహ్నాలు సైతం అద్భుతంగా చెక్కారు.
సాధారణంగా పురాతన ఆలయాల్లో ఆ కాలం నాటి ప్రజల చరిత్రను, వారి సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఎన్నో ఆనవాళ్లు ఉంటాయి. యాదాద్రిలో కూడా వర్తమాన చరిత్ర ప్రతిబింబించేలా శిలలు చెక్కాలని ఆదేశాలు జారీ చేయబడి ఉండవచ్చు అయితే యాదాద్రి శిలలపై ముఖ్యంగా కేసీఆర్ మరియు కారు గుర్తుపైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పుణ్యం కోసం, ప్రశాంతత కోసం వచ్చే దేవుని గుడిలో దేవుని సంబంధించినవి కాకుండా ఇవన్నీ ఏంటంటూ ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఏమి తన సొంత డబ్బుతో ఈ అలయాన్ని నిర్మించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ ఏమైనా దేవుడా, పవిత్రమైన స్థలాన్ని రాజకీయ అంశాలతో అపవిత్రం చేస్తున్నారు. వెంటనే ఆ చిత్రపటాలను తొలగించకపోతే దీనిని తమదైన శైలిలో పరిష్కరిస్తామని హెచ్చరించారు.
ఈ వివాదం ముదరడంతో ఆలయ అధికారులు దిగివచ్చారు. ప్రస్తుతం ఉన్న చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం కోసమే ఈ చిత్రాలను చెక్కినట్లు చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ చిత్రాన్ని చెక్కమని తమకెవరు చెప్పలేదని, శిల్పకారులకు ఇచ్చిన స్వేచ్ఛ మేరకు వారే ఈ చిత్రాలను చెక్కారని వివరణ ఇచ్చారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని తొలగిస్తామని వారు స్పష్టం చేశారు.