New Delhi, August 31: ప్రపంచ పోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో తెలంగాణ అటీవీ శాఖకు రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. అడవుల్లో అరుదుగా కనిపించే జీవులను, తమ కెమెరాల్లో బంధించిన అటవీశాఖకు చెందిన ఇద్దరు అధికారులు జాతీయ స్థాయిలో రెండవ, మూడవ స్థానాలను దక్కించుకున్నారు. ఆదిలాబాద్ అడవుల్లో ఠీవీగా నడుస్తున్న "రాయల్ బెంగాల్ టైగర్" మరియు ఒక కొమ్మపై నిల్చుని ఉన్న "అరుదైన జాతి గద్ద"కు సంబంధించిన ఫోటోలకు అవార్డులు వరించాయి.
వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (WCS) జాతీయ స్థాయిలో ఈ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. అదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర రావు, తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫోటో కు బెస్ట్ సెకండ్ ప్లేస్ విన్నర్ గాను, అలాగే జన్నారం డివిజనల్ అధికారిగా ఉన్న సిరిపురపు మాధవరావు కవ్వాల్ అభయారణ్యలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద ఫోటోకు (క్రెస్టెడ్ హాక్ ఈగల్ ) మూడో స్థానం దక్కింది.
తెలంగాణ అటవీశాఖకు ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డులను సాధించి పెట్టిన ఇద్దరు అధికారులను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అడవి సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్. శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.
ప్రథమ బహుమతి ఆసియా ఏనుగు ఫోటోకు లభించింది. కింద ఆ ఫోటోను చూడొచ్చు.
Best Wildlife Photograph 2020:
దేశ వ్యాప్తంగా అవార్డులు సాధించిన ఫోటోలను వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైట్ తమ వెబ్ సైట్ లోనూ, సోషల్ మీడియా పేజీల్లోనూ ప్రదర్శిస్తోంది. ఈ పోటీలో అస్సాం రాష్ట్రానికి ప్రథమ స్థానం లభించింది. లోయర్ అస్సాం డివిజన్ అటవీ చీఫ్ కన్జర్వేటర్ ఆకాశ్‌దీప్ బారువా మొదటి బహుమతిని, మధ్యప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాహుల్ సింగ్ సికార్వార్ నాలుగో బహుమతిని గెలుచుకున్నారు.ఇక ఐదవ బహుమతి గువహటిలోని కస్టమ్స్ డివిజన్ అయాన్ పాల్ ఇన్స్పెక్టర్ కు దక్కింది.