Hyderabad: గతేడాదితో పోలిస్తే తెలంగాణ (Telangana)లో ఈసారి చలి తీవ్రత తక్కువగా ఉంది. ఉత్తర భారతదేశం నుండి వీచే చల్లని గాలుల వలన ప్రతీ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉండేది, అయితే ఈసారి మాత్రం అందుకు భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆగ్నేయం నుంచి వెచ్చని, తేమగాలులు (Warm Winds) రాష్ట్రంవైపు వీస్తుండటం వల్ల ఈసారి చలితీవ్రత ఎక్కువగా లేకపోయినప్పటికీ, ఈపాటి చలికే ప్రజలు వణుకుతున్నారు. అయితే జనవరి తొలివారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ (Meteorological Department ) వెల్లడించింది.
ఆగ్నేయం (South-East)నుంచి వీస్తున్న ఈ తేమ గాలుల కారణంగా ఉత్తర తెలంగాణలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్ గా నమోదవుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు, శివారు ప్రాంతాల్లో 9.5 డిగ్రీలుగా నమోదయ్యాయి. తేమ గాలుల వలన హైదరాబాద్ లో డిసెంబర్ నెలలో సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతున్నాయి.
రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లోని పలుచోట్ల చెదురుమదురు వర్షాలు (Scattered Rains) కురిసే అవకాశం ఉందని పలు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ వర్షాల అనంతరం ఉష్ణోగ్రతలు కొంతమేర పడిపోయే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.