Burkina Faso, December 25: పండుగ పూట ఉగ్రవాదులు నరమేథాన్ని(Jihadists attacked) సృష్టించారు.ఆత్మాహూతి దాడికి తెగబడ్డారు. క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్న సమయంలో పశ్చిమాఫ్రికాలోని(West Africa) బుర్కినాఫసో (Burkina Faso)అనే దేశంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మంగళవారం రాత్రి జరిపిన దాడుల్లో కనీసం 35మంది పౌరులు మరణించినట్లు అధ్యక్షుడు రోక్ మార్క్ క్రిస్టియన్ కబోర్ (President Roch Marc Christian Kabore) ప్రకటించారు.
మాలి సరిహద్దుకు సమీపంలోని అర్బిండా అనే పట్టణంపై ముష్కరులు మంగళవారం ఉదయం దాడికి తెగబడ్డట్లు తెలిపారు.అనంతరం సైనిక బలగాలు నిర్వహించిన కాల్పుల్లో ఏకంగా 80 మందికి పైగా జిహాదీలు మృతిచెందారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు రోక్ మార్క్ క్రిస్టియన్ కబోర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
జిహాదీ గ్రూపులు మరిన్ని ఉన్నట్లు సమాచారం ఉందని, అర్బిండాలో అన్ని చోట్లా వాటి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్రిస్మస్ వేడుకల ఆరంభ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.
ఇరు వర్గాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఏడుగురు సైనికులు, 35 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారన్నారు. అయితే ఆ సమయంలో వారంతా అక్కడ ఎందుకున్నారో తెలియాల్సి ఉందని ఆఫ్రికా దేశ అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా బుర్కినా ఫసోపై ఇస్లామిక్ ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫ్రాన్స్ సైన్యం ఉగ్రవాద ముఠాలు స్వాధీనం చేసుకున్న అనేక ప్రాంతాల్ని తిరిగి సొంతం చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తోంది. ఈ క్రమంలో బుర్కినా ఫసో సైన్యానికి ఇటు ఫ్రాన్స్, అటు అమెరికా శిక్షణ ఇచ్చింది.
కాగా ఈ ప్రాంతంలో జిహాదీ దాడులు తరచూ జరుగుతూనే ఉంటాయి. చాలా సంవత్సరాల నుంచి బుర్కినా ఫాసోలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతూ ఉంది. అందుకే అక్కడ జిహాదీలను నియంత్రించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వ నేతృత్వంలోని సైనిక బలగాలు 2013 నుంచి జోక్యం చేసుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఇటువంటి దాడులు తరచుగా జరుగుతండటంతో దాదాపు అర మిలియన్‌కు పైగా ప్రజలు ఇప్పటికే ఆ ప్రాంతాలనుంచి వేరే ప్రాంతాలకు వలసవెళ్లారు.
గత నెలలో తూర్పు బుర్కినా ఫాసోలో కెనడియన్ మైనింగ్ కంపెనీకి చెందిన 37 మంది ఉద్యోగులను తీసుకెళ్తున్న కాన్వాయ్‌ను జిహాదీలు కాల్చి చంపారు. బుర్కినా ఫాసో యొక్క మిలిటరీకి ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ శిక్షణ ఇచ్చాయి. అయినా కూడా ఉగ్రవాదాన్ని నిరోధించడంలో బుర్కినా ఫాసో సైన్యం విఫలమవుతూ వస్తుంది.